Study Abroad: జర్మనీలో చదవడానికి విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపడానికి కారణాలివే
Study Abroad: విదేశాల్లో ఉన్నత విద్య అనగానే సాధారణంగా గుర్తొచ్చే దేశాలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే మొదలైనవి. అయితే, జర్మనీలో ఉన్నతవిద్య చదవాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణాలు ఇవే..
Study Abroad: విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లడం అనేది చాలా సాధారణమైన విషయంగా మారింది. వివిధ దేశాల్లో అక్కడి విద్యా సంస్థలు అందించే ప్రమాణాలతో పాటు ఆయా ప్రభుత్వాలు కల్పించే ప్రత్యేక సదుపాయాలు కూడా విద్యార్థులు ఆయా దేశాలు లేదా విద్యా సంస్థలను ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తాయి.
జర్మనీపై ఆసక్తి
ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు యూకే, యూఎస్ఏ తరువాత ఇతర ఎంపికల్లో కెనడా అగ్రస్థానంలో నిలిచింది. అయితే కెనడాతో భారత్ దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో విద్యార్థులు ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో యూరోప్ దేశమైన జర్మనీలో ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. జర్మన్ అకడమిక్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ (DAAD) విస్సెన్షాఫ్ట్ వెల్టోఫెన్ 2024 నివేదిక ప్రకారం, భారతీయ విద్యార్థుల సంఖ్య గత ఐదేళ్లలో సుమారు 138% పెరిగి 49,000 కు చేరుకుంది. ఇది జర్మనీ (Study Germany) లోని మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 13 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
జర్మనీని ఎంచుకోవడానికి కారణాలు
'స్టూడెంట్ సర్వే ఇన్ జర్మనీ' ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు జర్మనీని ఎంచుకోవడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి.
హై లివింగ్ స్టాండర్డ్స్, ఎంప్లాయ్ మెంట్
వీరిలో 65 శాతం మంది జర్మనీలో అధిక జీవన నాణ్యత చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గ్రాడ్యుయేషన్ తర్వాత ఉపాధి, ఆర్థిక పరిస్థితి, అక్కడే జీవితాన్ని కొనసాగించాలనే కోరిక ఇతర కారణాలు. అధిక జీవన ప్రమాణాలు, మంచి ఆర్థిక పరిస్థితి, జర్మనీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉపాధిని చేపట్టే అవకాశం వంటివి విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం, 2023/24 శీతాకాల సెమిస్టర్లో జర్మనీలో 49,008 మంది విద్యార్థులతో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, 2022/23 శీతాకాల సెమిస్టర్లో మొత్తం 42,100 మంది భారతీయ విద్యార్థులు జర్మనీలో గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నారు. ఇది మొత్తం అంతర్జాతీయ విద్యార్థులలో 12%. ఈ సంఖ్య 2017/18 శీతాకాల సెమిస్టర్తో పోలిస్తే 150% పెరిగింది. అలాగే, గత ఐదేళ్లలో జర్మనీకి వెళ్లిన భారతీయ విద్యావేత్తలు, పరిశోధకుల సంఖ్య ఐదేళ్లలో దాదాపు రెట్టింపు అయింది. 1,700 మందికి పైగా విద్యావేత్తలు, పరిశోధకులు జర్మనీ వెళ్లారు.