Germany visas: భారతీయ ఉద్యోగులకు జర్మనీ గుడ్ న్యూస్; వీసాల సంఖ్యలో భారీ పెంపు
Germany visas: నిపుణులైన భారతీయులు ఉద్యోగ అవకాశాలు పొందడానికి వీలుగా.. వారికి ఇచ్చే వీసాల సంఖ్యను జర్మనీ 20 వేల నుంచి 90 వేలకు పెంచింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ శుక్రవారం వెల్లడించారు. భవిష్యత్ ప్రపంచం యొక్క డిమాండ్లను తీర్చడానికి భారతదేశం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.
Germany visas: నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల వీసాలను 20,000 నుంచి 90,000కు పెంచుతూ జర్మనీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. 18వ ఆసియా-పసిఫిక్ కాన్ఫరెన్స్ ఆఫ్ జర్మన్ బిజినెస్ 2024లో శుక్రవారం ప్రధాని మోదీ మాట్లాడుతూ భవిష్యత్ ప్రపంచ డిమాండ్లను తీర్చడానికి భారత్ సన్నద్ధమవుతోందన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సదస్సులో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ కూడా పాల్గొన్నారు.
వికసిత్ భారత్ కోసం రోడ్ మ్యాప్
‘‘రాబోయే 25 ఏళ్లలో వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందించాం. ఈ ముఖ్యమైన సమయంలో, జర్మన్ క్యాబినెట్ 'ఫోకస్ ఆన్ ఇండియా' డాక్యుమెంట్ ను విడుదల చేసినందుకు నేను సంతోషిస్తున్నాను.... నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల వీసా సంఖ్యను 20 వేల నుంచి 90 వేలకు పెంచాలని జర్మనీ నిర్ణయించింది. ఇది జర్మనీ వృద్ధికి కొత్త వేగాన్ని ఇస్తుంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిభ, సాంకేతికత, సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు భారతదేశ వృద్ధిని నడిపించే సాధనాలు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఏఐ తో దూసుకువెళ్తాం
‘‘ప్రజాస్వామ్యం, జనాభా, డిమాండ్, డేటా అనే నాలుగు బలమైన స్తంభాలపై భారత్ నిలబడింది. ప్రతిభ, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు భారతదేశ వృద్ధికి సాధనాలు. వాటన్నింటినీ నడపడానికి, భారతదేశంలో ఒక బలమైన శక్తి ఉంది. అది కృత్రిమ మేధ. వృద్ధి చెందాలన్న భారతీయుల తపనకు కృత్రిమ మేధస్సు (artificial intelligence) తోడైన పరిస్థితి భారతదేశంలో ఉంది. భవిష్యత్ ప్రపంచ అవసరాలకు అనుగుణంగా భారత్ పనిచేస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
భారత్ అంటే వ్యాపారం మాత్రమే కాదు
భారత్ అంటే వ్యాపారం మాత్రమే కాదని ప్రధాని మోదీ (narendra modi) జర్మనీ వ్యాపారవేత్తలకు తెలిపారు. సంస్కృతి, వంటకాలు, షాపింగ్ వంటి భారతదేశ సారాంశాన్ని ప్రతిబింబించే అనేక అనుభవాలు ఉన్నాయని ఆయన అన్నారు. భారతదేశ సంస్కృతి, వంటకాలు, షాపింగ్ లకు సమయం కేటాయించకపోతే చాలా విషయాలను కోల్పోవాల్సి వస్తుందని, భారతదేశ వృద్ధిలో పాలుపంచుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన అన్నారు.