Canada High Alert : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపుతో వలసదారులపై ఎఫెక్ట్.. కెనడాలో హై అలర్ట్
Canada High Alert : అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత కెనడా హై అలర్ట్ ప్రకటించింది. వలసదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కెనడా అధికారులు.. సరిహద్దులను పరిశీలిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు పక్క దేశాలకు భయం పుట్టిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ వలసదారుల సామూహిక బహిష్కరణకు పిలుపునిచ్చారు. అమెరికాలో నివసించే వలసదారులు దేశ రక్తాన్ని విషపూరితం చేశారని కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత పక్క దేశమైన కెనడా అలర్ట్ అయింది. వలసదారులు తమ దేశంలోకి వచ్చే అవకాశం ఉన్నందున సరిహద్దుల్లో అధికారులు నిఘా పెంచారు.
యూఎస్‌లో చాలా మంది పత్రాలు లేని వలసదారులను, ఎక్కువగా మైనారిటీ కమ్యూనిటీలకు చెందినవారు, పొరుగున ఉన్న కెనడాలో ఆశ్రయం పొందవలసి వస్తుంది. తన ప్రచార సమయంలో వలసదారులు 'మన దేశ రక్తాన్ని విషపూరితం చేస్తున్నారు.' అని ట్రంప్ తరచుగా అన్నారు. దీంతో వారిపై కఠిన చర్యలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.
రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రతినిధి సార్జెంట్ చార్లెస్ పోయియర్, కెనడా హై అలర్ట్‌లో ఉందని చెప్పారు. ఏం జరగబోతుందో చూడడానికి సరిహద్దులో నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ట్రంప్ వలస వ్యతిరేక వైఖరి గురించి ప్రస్తావించారు. కెనడాకు అక్రమ వలసలు పెరగవచ్చని అభిప్రాయపడ్డారు.
భారీ సంఖ్యలో ప్రజలు కెనడా భూభాగంలోకి ప్రవేశిస్తారని సార్జెంట్ చార్లెస్ చెప్పారు. 'సరిహద్దు దాటి రోజుకు 100 మంది వ్యక్తులు ప్రవేశించారని అనుకుంటే అది తర్వాత చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయడానికి మా అధికారులు ప్రాథమికంగా చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది.' అని చార్లెస్ అన్నారు.
తమకు ఒక ప్రణాళిక ఉందని కెనడా డిప్యూటీ పీఎం చెబుతున్నారు. ఉప ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ కెనడా, ట్రంప్ పరిపాలనతో తలెత్తే సమస్యల మీద మంత్రుల బృందంతో సమావేశమయ్యారు. 'కెనడియన్లు తెలుసుకోవాలి. మన సరిహద్దులు సురక్షితంగా, భద్రంగా ఉన్నాయి. మేం అన్నింటిని నియంత్రిస్తాం.' అని డిప్యూటీ పీఎం తెలిపారు.
2017 నుండి 2021 వరకు ట్రంప్ మొదటి పదవీకాలంలో యూఎస్ నుంచి వచ్చి వేలాది మంది వలసదారులు కెనడాలో ఆశ్రయం పొందారు. ఈ సమయంలో కెనడాకు వెళ్లడం గురించి కూడా గూగుల్‌లో ఎక్కువ సెర్చింగ్ చేశారు. కెనడాకు వలస వెళ్లడం, కెనడాకు ఎలా వెళ్లాలి.. వంటి ప్రశ్నలను వలసదారులు గూగుల్‌ను ఎక్కువగా అడిగారు. ఇమ్మిగ్రేషన్, పునరావాస సేవలకు సంబంధించిన విచారణలు పెరిగాయి.
గతేడాది నిబంధనలను మార్చారు. ఈ మార్పుల తర్వాత యూఎస్ నుండి శరణార్థులు కెనడాలో ఆశ్రయం పొందడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో వేలాది మంది వస్తే పరిస్థితి అదుపు తప్పుతుందని కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ప్రతినిధి సార్జెంట్ చార్లెస్ హెచ్చరించారు. 8,891 కిలోమీటర్ల సరిహద్దులో కెమెరాలు, సెన్సార్లు, డ్రోన్‌లతో సహా అదనపు భద్రతా మోహరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.