Death penalty in Saudi: సౌదీలో డ్రగ్స్ కేసులో భారతీయుడికి మరణశిక్ష; తప్పుడు కేసు అంటున్న కుటుంబ సభ్యులు
Death penalty to an Indian in Saudi: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక భారతీయుడికి సౌదీ అరేబియాలో మరణ శిక్ష పడింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ జిల్లాకు చెందిన జైద్ 2023 జనవరి 15 నుంచి జెడ్డా సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు.
Death penalty to an Indian in Saudi: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణల కేసులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఒక యువకుడికి సౌదీ అరేబియా కోర్టు మరణ శిక్ష విధించింది. యూపీలోని మీరట్ జిల్లాలో ఉన్న ముండాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచౌటి గ్రామానికి చెందిన మహ్మద్ జైద్ (36)కు సౌదీ అరేబియా కోర్టు మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై మరణశిక్ష విధించింది. డ్రగ్స్ కేసులో 2023 జనవరి 15 నుంచి జైద్ జెడ్డా సెంట్రల్ జైలులో మగ్గుతున్నాడు. సౌదీలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
కుటుంబ సభ్యులకు షాక్
ముండాలి పోలీసులు మంగళవారం రాచౌటి గ్రామంలోని జైద్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దాంతో, అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. జైద్ తరఫున అతడి కుటుంబ సభ్యులు వాదించాలనుకుంటే, వారు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖను, సంబంధిత కోర్టును సంప్రదించవచ్చని ఆ నోటీసులో పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న జైద్ 2023 జనవరి 15 నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా సెంట్రల్ జైలులో ఉన్నాడని నోటీసులో పేర్కొన్నారు. మక్కాలోని క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. అక్కడ జైద్ కు మరణశిక్ష విధించారు.
2018 లో సౌదీకి..
జైద్ 2018లో సౌదీ అరేబియా వెళ్లి ఓ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని జైద్ తమ్ముడు మహ్మద్ సాద్ తెలిపారు. సౌదీలో తన సోదరుడు ప్రమాదానికి గురయ్యాడని, ఆ క్రమంలో అతడికి ఆహారం, ఇతర రోజువారీ అవసరాలు తీర్చినందుకు బదులుగా స్థానిక పోలీసు ఒకరు తన సోదరుడిని డ్రైవర్ గా వాడుకుంటున్నాడని మహ్మద్ సాద్ ఆరోపించాడు. భారత్ కు తిరిగి వెళ్తానని తన సోదరుడు పట్టుబట్టడంతో అతడిని తప్పుడు కేసుల్లో ఇరికించారని సాద్ చెప్పారు.