Jagtial Crime : మద్యం మత్తులో కుటుంబ సభ్యులకు వేధింపులు- కొట్టి బాత్ రూమ్ లో బంధిస్తే ప్రాణాలు కోల్పోయిన యువకుడు
Jagtial Crime : మద్యం మత్తు ప్రాణం తీసింది. మత్తులో కన్నవారిని కట్టుకున్న భార్యను కడుపున పుట్టిన బిడ్డను వేధించాడు. చివరకు చావు దెబ్బలు తిని బాత్రూంలో మరణించాడు. దెబ్బలకు తాళలేక బయటికి వెళ్లే మార్గం లేక బాత్రూంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా పూడూరులో జరిగింది.
Jagital Crime : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన పెద్ది రాజశేఖర్ మృతి కలకలం సృష్టిస్తుంది. నిత్యం మద్యం మత్తులో జోగే రాజశేఖర్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. తాగిన మైకంలో నిత్యం తల్లిదండ్రులతో పాటు భార్య బిడ్డను వేధించేవాడు. రోజు మాదిరిగానే తాగొచ్చిన రాజశేఖర్ కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. తల్లిదండ్రులను భార్యాబిడ్డను చంపుతానని బెదిరించాడు. దీంతో తాగిన మైకంలో ఏమైనా చేయొచ్చని భావించిన కుటుంబ సభ్యులు కర్రతో రాజశేఖర్ పై దాడి చేశారు. లేస్తే తమరిని ఏమి చేస్తాడోనని భావించిన కుటుంబ సభ్యులు భయంతో రాజశేఖర్ బాత్రూంలో నిర్బంధించారు. గంటల తరబడి బాత్రూంలో ఉన్న రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయాడు.
కొట్టి చంపారంటున్న స్థానికులు
మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవపడి దాడికి యత్నించడంతో కుటుంబ సభ్యులు కొట్టి చంపారని స్థానికులు అంటున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తాగొచ్చి గొడవ చేయడంతో పాటు కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో కొట్టామని, అందరిని చంపుతానని బెదిరించడంతో భయంతో బాత్రూంలో నిర్బంధించామని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించి హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. తాగొచ్చి గొడవ చేస్తే డయల్ 100 కు కాల్ చేస్తే చట్ట పరిధిలో అతని శిక్షించే వారిని పోలీసులు తెలిపారు. బిడ్డ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే అతని ప్రాణాలు తీసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
అనాథను చేరదీసి పెంచిన పేరెంట్స్...
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవడంతో అనాథగా మారిన రాజశేఖర్ ను బంధువుల ద్వారా సంతానం లేని పూడూరుకు చెందిన పెద్ది కొమురవ్వ - మల్లయ్య దంపతులు చేరదీశారు. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద సాగరిక అనే అమ్మాయితో పెళ్లి చేశారు. సాగరిక రాజశేఖర్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఓ బాబు, పాప జన్మించారు. మద్యానికి బానిసైన రాజశేఖర్ నిత్యం మత్తులో జోగుతూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. చివరికి కుటుంబ సభ్యులతో గొడవపడి తన్నులు తిని బాత్రూంలో నిర్బంధించబడి ప్రాణాలు కోల్పోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
నరకం చూపాడు..చచ్చి ఇబ్బంది పెడుతుండు
సంతానం లేదని ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని సాదుకుంటే నరకం చూపాడని పెంచి పోషించిన కొమరవ్వ మల్లయ్య దంపతులు బోరున విలపించారు. బతికుండి నరకం చూపిన కొడుకు, భయంతో బాత్ రూమ్ లో నిర్బంధిస్తే ఇప్పుడు ప్రాణాలు కోల్పోయి కేసుల పాలు చేసి ఇబ్బందుల గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కొడుకు ఉన్న ఒక్కటే లేకున్నా ఒక్కటేనని కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దని భగవంతుని వేడుకున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం