Cats: పిల్లి యజమానులు జాగ్రత్త, పందుల్లాగే మహమ్మారి రోగాలకు కారణమవుతున్న పిల్లులు? కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు-cat owners beware are cats causing pandemics like pigs shocking results from a new study ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cats: పిల్లి యజమానులు జాగ్రత్త, పందుల్లాగే మహమ్మారి రోగాలకు కారణమవుతున్న పిల్లులు? కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

Cats: పిల్లి యజమానులు జాగ్రత్త, పందుల్లాగే మహమ్మారి రోగాలకు కారణమవుతున్న పిల్లులు? కొత్త అధ్యయనంలో షాకింగ్ ఫలితాలు

Haritha Chappa HT Telugu
Dec 18, 2024 07:00 PM IST

Cats: పందులు కొత్త వైరస్‌లను మోసుకుని తిరుగుతాయి. వాటి వల్ల చాలా ప్రాణాంతక మహమ్మారి రోగాలు వ్యాప్తి చెందాయి. ఇప్పుడు పిల్లులు కూడా పందుల్లాగే రోగాలకు కారణమయ్యే వైరస్‌లకు ఇల్లుగా మారుతాయని, మనుషులు వాటికి దూరంగా ఉండాలని ఒక కొత్త అధ్యయనం తెలిపింది.

పిల్లులతో జాగ్రత్త
పిల్లులతో జాగ్రత్త

పిల్లులను పెంచుకునేవారి సంఖ్య ఎక్కువే. మనదేశంలో కుక్కలు, పిల్లులనే అధికంగా పెంచుతారు. ఇక విదేశాల్లో పిల్లులను పెంచుకుంటున్న వారి సంఖ్య ఇంకా అధికం. అయితే వీటితో జాగ్రత్తగా ఉండాని కొత్త అధ్యయనం చెబుతోంది. పెంపుడు పిల్లులు పందుల్లాగే ప్రమాదకరంగా మారుతాయని ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చింది. ఇది ప్రజారోగ్యానికి అతిపెద్ద మహమ్మారికి కారణం కావొచ్చని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

ఇటీవల టేలర్ అండ్ ఫ్రాన్సిస్ ఆన్ లైన్ అనే అకడమిక్ జర్నల్ లో ప్రచురితమైన అధ్యయనంలో పెంపుడు పిల్లులు హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ రూపాంతరం చెందడానికి కారణం అవుతుందని చెబుతున్నారు. అది మానవులకు సోకడానికి అవకాశాన్ని పిల్లులు కలిగిస్తాయని కనుగొన్నారు. పెంపుడు పిల్లులు ఇళ్లలో నివసించినప్పుడు మన సోఫాలు, మంచాలపై నడుస్తాయి. అలా ఇవి మానవ ఫ్లూ స్ట్రెయిన్లను సంక్రమించేలా చేయడమే కాకుండా ఏవియన్ వైరస్‌లను ప్రజలకు వ్యాప్తి చెందేలా చేస్తాయి.

పందుల్లాగే పెంపుడు పిల్లులు కూడా

పందుల మాదిరిగా పిల్లులు సెల్యులార్ గ్రాహకాలను కలిగి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు, ఇవి ఏవియన్, క్షీరదాల ఇన్ఫ్లుఎంజా వైరస్ పునరుత్పత్తికి కారణం అవుతాయని చెబుతున్నారు. ఇటీవల హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూతో మరణించిన పిల్లుల్లో 'ప్రత్యేక ఉత్పరివర్తనాలు' ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు.

పందులు ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే వాటి కణాలు వైరస్‌లను కలపడానికి, పరివర్తన చెందడానికి అనుమతిస్తాయి. మానవ అంటువ్యాధులకు కారణమయ్యే కొత్త జాతులను సృష్టిస్తాయి.

పిల్లులు తరచుగా మానవులు, ఇతర జాతులతో సంకర్షణ చెందుతాయని, అందువల్ల హెచ్5ఎన్1 వైరస్‌ల క్రాస్-జాతుల వ్యాప్తికి వారధిగా పనిచేస్తాయని వారు తెలిపారు. పిల్లుల్లో హెచ్5ఎన్1 వైరస్ వ్యాప్తి అనేది ప్రజారోగ్యంపై గణనీయమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయని అధ్యయన రచయితలు తెలిపారు.

చనిపోయిన పిల్లులపై పరిశోధన

ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధకులు పది మరణించిన పిల్లులకు పోస్టుమార్టం నిర్వహించారు. వీటిలో ఒకటి ఈ ఏడాది ఏప్రిల్ లో చనిపోయిన పక్షుల అవశేషాలను తిన్న తరువాత హెచ్5ఎన్1 తో మరణించిన పిల్లి. వాటి మెదడు, ఊపిరితిత్తులు, పొట్టల నుండి సేకరించిన నమూనాలలో వారి కణాలలో గ్రాహకాలు ఉన్నాయని కనుగొన్నార.

వైరస్ సోకిన పిల్లులు శ్వాసకోశ, జీర్ణవ్యవస్థల ద్వారా వైరస్‌ను విసర్జిస్తాయి. ఆ వైరస్ అనేక రకాలుగా మనుషులకు సోకుతుంది. క్షీరదాల జాతికి చెందిన పిల్లుల్లో వైరస్ కొనసాగే, స్వీకరించే సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది. ఇది తీవ్రమైన మహమ్మారి రోగాలకు కారణం అవుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner