Chandipura Virus: చండీపురా వైరస్‌తో జాగ్రత్త, 15 ఏళ్లలోపు పిల్లలపైనే దాడి చేసి ప్రాణాలు తీస్తున్న వైరస్-beware of chandipura virus a virus that attacks and kills children under 15 years of age ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chandipura Virus: చండీపురా వైరస్‌తో జాగ్రత్త, 15 ఏళ్లలోపు పిల్లలపైనే దాడి చేసి ప్రాణాలు తీస్తున్న వైరస్

Chandipura Virus: చండీపురా వైరస్‌తో జాగ్రత్త, 15 ఏళ్లలోపు పిల్లలపైనే దాడి చేసి ప్రాణాలు తీస్తున్న వైరస్

Haritha Chappa HT Telugu
Jul 23, 2024 08:00 AM IST

Chandipura Virus: చండీపురా వైరస్ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది కేవలం పిల్లలనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది.

చండీపురా వైరస్
చండీపురా వైరస్ (Pixabay)

Chandipura Virus: గుజరాత్‌లో చండీపురా వైరస్ బారిన పడిన కేసులు పెరుగుతున్నాయి. 13 మందికి ఈ చండీపురా వైరస్ సోకినట్టు గుర్తిస్తే అందులో ఐదుగురు మరణించినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. నాలుగేళ్ల బాలిక ఈ చండీపురా వైరస్ బారిన పడి మరణించినట్టు పూణేలోని నేచురల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఈ వైరస్ బారిన పడుతున్న వారు అధికంగానే ఉన్నట్టు గుర్తిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ లలో ఈ వైరస్ బారిన పడిన రోగులను గుర్తించినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో 26 మంది, రాజస్థాన్లో ఇద్దరు, మధ్యప్రదేశ్లో ఒకరికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు.

చండీపురా వైరస్ అంటే ఏమిటి?

ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో స్క్రీనింగ్ జరుగుతోంది. ఎంతమందికి ఈ వైరస్ సోకిందో గుర్తించడానికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైరస్ మన దేశానికి కొత్త కాదు. 2003-2004 సంవత్సరాల మధ్యలో ఈ చండీపురా వైరస్ కారణంగా ఎన్నో మరణాలు సంభవించాయి. అంతకుముందు తొలిసారి భారతదేశంలో ఈ వైరస్‌ను 1965లో మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఉన్నా చాందీపురా గ్రామంలో గుర్తించారు. అక్కడినుంచి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, గుజరాత్‌లలో అప్పట్లో ఈ వైరస్ వ్యాపించింది. అందుకే ఈ వైరస్‌కు ఆ గ్రామం పేరే పెట్టారు. అలా ఇది చండీపురా వైరస్ గా మారింది.

చండీపురా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఎక్కువ శాతం మంది 15 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారే. ఇది ముఖ్యంగా పిల్లలనే ఎందుకు టార్గెట్ చేస్తోందంటే... వారి రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. ఈ వైరస్ రాబ్డోవిరిడే అనే కుటుంబానికి చెందినది. వర్షాకాలంలో ఎక్కువగా ఇది వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా సాండ్ ఫ్లై (Sand Fly) అని పిలిచే కీటకం వల్ల ఇది ప్రజల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దోమల వల్ల కూడా వ్యాప్తి చెంది అవకాశం ఉంది.

చండీపురా వైరస్ సోకితే కనిపించే లక్షణాలు

ఈ వైరస్ సోకిన వారికి జ్వరం అధికంగా వస్తుంది. తలనొప్పిగా ఉంటుంది. మూర్ఛలు వచ్చి పోతుంటాయి. ఈ మూర్చలు చివరికి కోమాకు, మరణానికి కూడా దాడి తీస్తాయి. రోగ నిర్ధారణ చేసి తక్షణం చికిత్స అందించకపోతే పిల్లల్లో మరణాల రేటు పెరిగిపోతుంది. కాబట్టి పిల్లలను ఈ వైరస్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

వర్షాకాలంలో పిల్లలు ఎలాంటి దోమ కాటుకు, కీటకాల కాటుకు గురికాకుండా చూసుకోవాలి. శరీరమంతా కప్పేలా పిల్లలకి దుస్తులను వేయాలి. సాయంత్రం, తెల్లవారుజామున ఈ సాండ్ ఫ్లై అధికంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వీటిని నివారించేందుకు క్రిమిసంహారక స్ప్రేలు వాడుతూ ఉండాలి. ఇంటి చుట్టూ ఈ క్రిమిసంహారక స్ప్రేలను చల్లుకోవాలి.

2003లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ వైరస్ సోకిన పిల్లలను గుర్తించారు. వారి వయసు 9 నెలల నుండి 14 ఏళ్ల మధ్య ఉంది. వీరు ఆస్పత్రిలో చేరినప్పటికీ 48 గంటల్లోనే మరణాలు సంభవించాయి. ప్రస్తుతం గుజరాత్‌లో అనుమానాస్పదంగా మరణిస్తున్న పిల్లల్లో ఈ వైరస్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ వైరస్‌కు ఇప్పటివరకు నిర్దిష్ట యాంటీ వైరల్ ఏజెంట్ లేదా టీకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇల్లును వీలైనంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గదులు చీకటిగా లేకుండా చూసుకోవాలి. ఇల్లు తేమగా మారిపోతే సాండ్ ఫ్లైలు, దోమలు అధికంగా చేరుతాయి. కాబట్టి ఇంట్లో వెలుగు ప్రసరించేలా జాగ్రత్త పడాలి.

Whats_app_banner