Paritala Ravi Murder Case : మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు, 18 ఏళ్ల తర్వాత ఐదుగురు నిందితులకు బెయిల్
Paritala Ravi Murder Case : మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఈ కేసులో నిందితులకు బెయిల్ దక్కింది. 2005 జనవరి 24న పరిటాల రవి హత్యకు గురయ్యారు.
Paritala Ravi Murder Case : టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసు నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హత్య జరిగిన 18 ఏళ్ల తర్వాత ఐదుగురి నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ3 నారాయణరెడ్డి, ఏ4 రేఖమయ్య, ఏ5 రంగనాయకులు, ఏ6 వడ్డే కొండ, ఏ8 ఓబిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2005 జనవరి 24న అనంతపురం జిల్లా పెనుకొండలో పరిటాల రవి హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న పరిటాల రవిపై ప్రత్యర్థులు దాడి చేసి హత్య చేశారు. పరిటాల రవి మరణాంతరం ఆయన సతీమణి సునీత రాజకీయాల్లో వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు.
ఈ కేసులో విడుదలైన నిందితులు ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతు విధించింది. రూ.25 వేలతో రెండు పూచీ కత్తులు ఇవ్వాలని ఆదేశించింది. జైలు నుంచి విడుదలయ్యాక ప్రవర్తన బాగోలేదని ఫిర్యాదు వస్తే బెయిల్ రద్దు చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన నిందితులు కాబట్టి ముందస్తు విడుదల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. నిబంధనల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.
అసలేం జరిగింది?
జనవరి 24, 2005న అనంతపురం జిల్లా పెనుగొండ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవిని పట్టపగలే ప్రత్యర్థులు కాల్చి చంపారు. రవి తలపై బుల్లెట్ గాయం కావడంతో అక్కడికక్కడే ఆయన మరణించారు. ఆయనతో పాటు గన్ మాన్, పరిటాల అనుచరుడు ఈ దాడిలో మృతి చెందారు. ఈ సమయంలో కొందరు బాంబులు విసరడంతో...నిందితులు ఘటనాస్థలి నుంచి పరారయ్యారు. పరిటాల మర్డర్ కేసులో అప్పటి సీఎం వైఎస్ఆర్ కుమారుడు వైఎస్ జగన్, జేసీ దివాకర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో వీరిద్దరూ నిర్దోషులుగా విడుదలయ్యారు.
పరిటాల రవి, కాంగ్రెస్ నేత గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ సూరి కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా ఉన్న గొడవలు హత్యకు దారితీసిందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో సూరి... పరిటాల రవి హత్యకు కుట్రపన్నారని సీబీఐ తేల్చింది. జె. శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను, పి. నారాయణ రెడ్డి, రేఖమయ్య...పరిటాల రవీంద్రను కాల్చి చంపారని సీబీఐ దర్యాప్తులో నిర్థారించింది. ఆరు ఏళ్ల పాటు విచారణ జరిపిన సీబీఐ నివేదికతో కోర్టు ఎనిమిది మంది నిందితులు నారాయణ రెడ్డి, వి. రేఖమయ్య, భజన రంగనాయకులు, ఎ. కొండయ్య, వడ్డే శ్రీనివాసులు, మెదిమి ఓబిరెడ్డి, తరుగు పెద్ది రెడ్డి, వన్న హనుమంత రెడ్డికి జీవిత ఖైదు విధించింది. మొత్తం ఎనిమిది మందిని అనంతపురం సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చి జీవిత ఖైదు విధించింది.
ఈ కేసు విచారణ సమయంలో ముగ్గురు ప్రధాన నిందితులు సూరి, మొద్దు శ్రీను, కొండా రెడ్డి హత్యకు గురయ్యారు. దీంతో ఈ కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో మరో నలుగురు నిందితులు జి. వెంకట్రామి రెడ్డి, ఆనంద్ కుమార్ రెడ్డి, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి, వెంకటస్వామిలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. మరో నిందితుడు రామ్మోహన్ రెడ్డి అప్రూవర్‌గా మారడంతో కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
సంబంధిత కథనం