AP Home Guards : హోంగార్డులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, కానిస్టేబుళ్ల భర్తీలో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు-ap high court good news to home guards consider special category in constable recruitment ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Home Guards : హోంగార్డులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, కానిస్టేబుళ్ల భర్తీలో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు

AP Home Guards : హోంగార్డులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, కానిస్టేబుళ్ల భర్తీలో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 18, 2024 06:43 PM IST

AP Home Guards : హోంగార్డులకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హోంగార్డులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, కానిస్టేబుళ్ల భర్తీలో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు
హోంగార్డులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, కానిస్టేబుళ్ల భర్తీలో ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశాలు

AP Home Guards : ఏపీ హోంగార్డులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది. ఆరు వారాల్లో ప్రత్యేక మెరిట్ జాబితా తయారీ పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు డిసెంబర్ 3న వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పు ఇచ్చింది.

అసలేం జరిగింది?

హోంగార్డుల‌ు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందేందుకు ప్రాథ‌మిక రాత ప‌రీక్షల్లో క‌నీస మార్పులు రావాల్సిందేన‌ని పోలీసు నియామ‌క బోర్డు (ఎస్ఎల్‌పీఆర్‌బీ) నిబంధన పెట్టింది. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక కోసం నిర్వహించిన ప్రాథ‌మిక రాత ప‌రీక్షలో క‌నీస అర్హత మార్కులు సాధించ‌లేదంటూ పలువురు హోంగార్డులను అన‌ర్హులుగా ప్రక‌టించింది. దీంతో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ప‌లువురు హోంగార్డులు హైకోర్టులో పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్లపై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు నవంబర్ 12, 2005 మ‌ధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డులకు దేహ‌దారుఢ్య, తుది రాత ప‌రీక్షల‌కు అనుమ‌తించాల‌ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలపై కౌంటర్ దాఖలు చేసిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు... ప్రాథ‌మిక రాత ప‌రీక్షలో అర్హులు కాని వారికి నోటిఫికేష‌న్‌ను ప్రశ్నించే హ‌క్కు లేద‌ని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందని కౌంట‌ర్‌లో పేర్కొంది. పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసే స‌మ‌యంలోనే నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న ష‌ర‌తుల గురించి పిటిష‌న‌ర్లు అంద‌రికీ స్పష్టంగా తెలుస‌ని తెలిపింది. వీటిని అంగీక‌రించిన త‌రువాతే అభ్యర్థులు ప్రాథ‌మిక ప‌రీక్షకు హాజ‌ర‌య్యార‌ని రిక్రూట్మెంట్ బోర్డు హైకోర్టుకు తెలిపింది. ప్రాథ‌మిక రాత ప‌రీక్షలో ఉత్తీర్ణత సాధించ‌లేక‌పోవ‌డంతో నోటిఫికేష‌న్‌ను త‌ప్పుప‌డుతున్నార‌ని కౌంట‌ర్‌లో పేర్కొంది. ఈ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు డిసెంబర్ 3న తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ తుది తీర్పు వెలువరుస్తూ... హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని ఆదేశించింది.

దేహదారుఢ్య పరీక్షల కాల్ లెటర్స్ విడుదల

గ‌త ప్రభుత్వం 2022 న‌వంబ‌ర్ 28న 6,100 పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇచ్చింది. ప్రిలిమ్స్ ప‌రీక్ష ను 2023 జ‌న‌వ‌రి 22న నిర్వహించారు. ప్రిలిమ్స్ ప‌రీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజ‌రయ్యారు. 2023 ఫిబ్రవ‌రి 5న ప‌రీక్ష ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. మొత్తం 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహ‌దారుఢ్య, శారీర‌క సామ‌ర్థ్య (పీఎంటీ, పీఈటీ) ప‌రీక్షలు నిర్వహించాల్సి ఉంది.

ఏపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు కాల్‌ లెటర్లు విడుదలయ్యాయి. రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి 29వ తేదీ వరకు కాల్ లెటర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు ఈ లింకు ద్వారా కాల్ లెటర్స్‌ డౌన్‌ లోడ్ చేసుకోవచ్చు. https://slprb.ap.gov.in/UI/index డిసెంబర్ 30 నుంచి దేహదారుఢ్య పరీక్షల్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

దేహదారుఢ్య పరీక్షలు 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 1వరకు నిర్వహిస్తారని రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఆఫీసుఉ.10-సా.6సమయంలో నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Whats_app_banner