Bird Flu Death: బర్డ్ ఫ్లూ వైరస్ కోళ్లనే కాదు ఇప్పుడు మనుషులను చంపేస్తోంది, బర్డ్ ఫ్లూ వల్ల తొలి మరణం ఇదిగో
Bird Flu Death: బర్డ్ ఫ్లూ కేవలం పక్షులకు, కోళ్లకు మాత్రమే వస్తుందని మొన్నటి వరకు తెలుసు. మనిషికి సోకినా అది ప్రాణం తీయలేదనే భావన ఉంది. అయితే ఇప్పుడు తొలి మానవ మరణం సంభవించింది.
Bird Flu Death: బర్డ్ ఫ్లూను H5N2 అని అంటారు. ఈ వైరస్ పక్షులకు సోకుతుంది. కోళ్లకు అధికంగా వస్తుంది. ఇవి సోకిన కోళ్లు మరణిస్తాయి. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు సోకినా కూడా మరణం సంభవించదని మొన్నటి వరకు వైద్యులు భావించారు. అయితే బర్డ్ ఫ్లూ కారణంగా ఒక మనిషి మరణించాడు. ప్రపంచంలో ఇదే తొలి బర్డ్ ఫ్లూ మానవ మరణంగా చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. మెక్సికో సిటీలో నివసించే 59 ఏళ్ల వ్యక్తికి ఈ బర్డ్ ఫ్లూ సోకింది. అతను విపరీతమైన జ్వరంతో శ్వాస ఆడక ఇబ్బంది పడ్డాడు. అతిసారం బారిన పడ్డాడు. ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. మూత్రపిండాలు విఫలమయ్యాయి. మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు కూడా ఆయనకి ఉన్నాయి. ఆ వ్యక్తి బర్డ్ ఫ్లూ కారణంగా మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఏమిటి బర్డ్ ఫ్లూ వైరస్?
ఇది పక్షులకు మాత్రమే సోకే వైరస్. కానీ ఇప్పుడు మనుషులకు సోకుతుందని నిర్ధారణ జరిగింది. H5N2 అని పిలిచే ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కు చెందిన ఉపరకం. ఇది ఒక అంటువ్యాధి. ఇవి సోకిన పక్షులు బతకడం చాలా కష్టం. శ్వాసకోశ అనారోగ్యాల బారిన పడి మరణిస్తాయి. అది మనుషులకు సోకుతుందని తెలుసు. కానీ చాలా అరుదుగా మాత్రమే సోకుతుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లు, పక్షులతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్న మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసే వారికి ఇది వచ్చే అవకాశం ఎక్కువ. అయితే చిన్న చిన్న లక్షణాలతోనే ఇది తగ్గిపోయేది. కానీ తొలిసారి ఒక మనిషి ప్రాణాన్ని తీయడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.
బర్డ్ ఫ్లూ సోకిన మనుషులకు శ్వాసకోస ఇన్ఫెక్షన్లు వస్తాయి. కండ్ల కలక, జీర్ణాశయంతర లక్షణాలు, మెదడు వాపు వంటి లక్షణాలు కూడా కనిపించాయి. వీటివల్లే ప్రాణాంతకంగా పరిస్థితి మారుతుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే...
బర్డ్ ఫ్లూ సోకిన మనుషులలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత తీవ్రమైన శ్వాసకోశ సమస్యలుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యం తీసుకోవడం చాలా మంచిది. ఇది అంటువ్యాధి కూడా. కాబట్టి వారి చుట్టుపక్కల ఉన్న వారికి సోకే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ మనుషుల్లో విపరీతంగా వ్యాపించడం మొదలుపెట్టలేదు. భవిష్యత్తులో అది కూడా జరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
ఒక కోడికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకితే ఆ కోళ్ల ఫామ్ లో ఉన్న అన్ని కోళ్లకు ఒక్క రోజులోనే ఈ వైరస్ సోకుతుంది. కరోనా వైరస్ వంటి వ్యాప్తినే ఇది కలిగి ఉంటుంది. మనుషులకు ఈ బర్డ్ ఫ్లూ సోకితే కరోనా వైరస్ ఎంత వేగంగా మనుషుల్లో వ్యాపించిందో ఇది కూడా అంతే వేగంగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నప్పుడు కోడి మాంసాన్ని కొన్ని రోజులపాటు తినకుండా ఉండడమే అన్నిటికంటా ఉత్తమమైన పద్ధతి.
టాపిక్