Yadadri Bhuvanagiri News : యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు-yadadri bhuvanagiri govt school students severely injured oil poured two other hands break ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Bhuvanagiri News : యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు

Yadadri Bhuvanagiri News : యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు

Bandaru Satyaprasad HT Telugu
Dec 18, 2024 08:52 PM IST

Yadadri Bhuvanagiri News : యాదాద్రి భువగిరి జిల్లాలో దారుణ ఘటనలు జరిగాయి. వంటవాళ్లకు బదులుగా విద్యార్థులతో వంట చేయించడంతో...వేడి నూనె పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఘటనలో ప్రిన్సిపల్ కొట్టడంతో ఇద్దరు విద్యార్థినుల చేతి వేళ్లు విరిగాయి.

యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు
యాదాద్రి జిల్లాలో దారుణం, పాఠశాలకు వెళ్లి తీవ్రగాయాల పాలైన విద్యార్థులు

Yadadri Bhuvanagiri News : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటనలు జరిగాయి. నారాయణపురం మండలంలోని సర్వేల్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై వేడి నూనె పడింది. వంటవాళ్లకు బదులుగా విద్యార్థులతో వంటపని చేయించడంతో ఓ విద్యార్థిపై వేడి నూనె పడింది. ఈ ఘటనలో విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. సర్వేల్‌ గురుకుల పాఠశాలలో వంట మనుషులు సరిపడా సంఖ్యలో లేకపోవడంతో విద్యార్థులను వంటపనికి వినియోగిస్తున్నారు. 8వ తరగతి విద్యార్థి వంట చేస్తున్న క్రమంలో ప్రమాదవశాక్తు వేడి నూనె ఒంటిపై పడింది. విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థినుల చేతి వేళ్లు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్

యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో దారుణం జరిగింది. జావ తాగుతున్న విద్యార్థినులను ప్రిన్సిపల్ విచక్షణా రహితంగా కొట్టడంతో..ఇద్దరి విద్యార్థినుల చేతి వేళ్లు విరిగిపోయాయి. వలిగొండ మండలంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వలిగొండ మండలం లోతుకుంట గ్రామంలోని మోడల్ స్కూల్‌లో గోగు అఖిల, కోరబోయిన అక్షితలు అనే ఇద్దరు విద్యార్థినులు 8వ తరగతి చదువుతున్నారు. గత వారం గురువారం ఉదయం జావ తాగుతుండగా.....ఎంతసేపు తాగుతారని ప్రిన్సిపల్ రహి సున్నిసా బేగం విద్యార్థినుల తిడుతూ పైపుతో కొట్టారు. క్లాసులు ముగిశాక విద్యార్థినులు ఇంటికి వెళ్లిపోయారు. చేతులు నొప్పిగా ఉన్నా... ప్రిన్సిపల్ మళ్లీ కొడతారేమోనన్న భయంతో జరిగిన విషయం ఇంట్లో చెప్పలేదు విద్యార్థినులు. శుక్రవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులను పరిశీలించిన ప్రిన్సిపల్...చేతులు వాపును చూసి వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థినులను పరిశీలించిన వైద్యుడు...ఒకరికి బొటన వేలు, మరొకరికి మణికట్టు కీలు విరిగిందని చెప్పి కట్టుకట్టి పంపించారు. చేతికి కట్టుతో ఇంటికి వెళ్లిన విద్యార్థినులు జరిగిన విషయం తల్లిదండ్రులు చెప్పారు.

రెండ్రోజులు స్కూల్‌కు సెలవులు కావడంతో.. సోమవారం స్కూల్ కు వెళ్లిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్ ను జరిగిన ఘటనపై నిలదీశారు. ప్రిన్సిపల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతులు విరగొట్టి క్షమాపణలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం