Leela Vinodam Review: లీలా వినోదం రివ్యూ - బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?-leela vinodam review bigg boss fame shanmukh jaswanth romantic love drama movie plus and minus points ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Leela Vinodam Review: లీలా వినోదం రివ్యూ - బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

Leela Vinodam Review: లీలా వినోదం రివ్యూ - బిగ్‌బాస్ ష‌ణ్ముఖ్ ల‌వ్‌స్టోరీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Dec 21, 2024 03:33 PM IST

Leela Vinodam Review: బిగ్‌బాస్ ఫేమ్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ హీరోగా న‌టించిన లీలా వినోదం మూవీ ఈ టీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాతో మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

లీలా వినోదం రివ్యూ
లీలా వినోదం రివ్యూ

Leela Vinodam Review: ష‌ణ్ముఖ్ జ‌స్వంత్..యూట్యూబ‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టాడు. బిగ్‌బాస్‌తో ఫేమ‌స్ అయ్యాడు. అదే ఊపుతో హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌ని క‌ల‌లు క‌న్నాడు. కానీ వివాదాలు, కేసుల కార‌ణంగా అత‌డి డ్రీమ్ ఆల‌స్య‌మైంది. హీరోగా డైరెక్ట్‌గా సిల్వ‌ర్‌స్క్రీన్‌పై త‌న ల‌క్ ప‌రీక్షించుకోకుండా లీలా వినోదం పేరుతో ఓటీటీ మూవీ చేశాడు.

ఈటీవీ విన్ ఓటీటీలో ఇటీవ‌ల ఈ మూవీ రిలీజైంది. ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీకి ప‌వ‌న్ సుంక‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ల‌యాళ బ్యూటీ అన‌ఘా అజిత్ హీరోయిన్‌గా న‌టించింది. లీలా వినోదం మూవీతో హీరోగా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ ఓటీటీ ప్రేక్ష‌కుల్ని మెప్పించాడా? లేదా? అంటే?

ప్ర‌సాద్ లీలా ప్రేమ‌క‌థ‌...

పీఎమ్ఆర్‌కేవీ ప్ర‌సాద్ (ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌) డిగ్రీ చివ‌రి ఎగ్జామ్ రాసి కాలేజీ బ‌య‌ట తాను ప్రేమించే అమ్మాయి లీలా కుమారి (అన‌ఘా అజిత్‌) కోసం ఎదురుచూస్తుంటాడు. మూడేళ్ల నుంచి లీలాను ప్రేమిస్తోన్నా ఆ విష‌యం ఆమెకు చెప్ప‌లేక‌పోతాడు. త‌న ప్రేమ‌ను డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం లేక స్లామ్ బుక్‌లో త‌న ఫోన్ నంబ‌ర్ రాసి లీలాకు ఇస్తాడు ప్ర‌సాద్‌.

ఆ త‌ర్వాత లీలా అత‌డికి ఫోన్ చేస్తుంది. ఇద్ద‌రి మ‌ధ్య కొన్నాళ్లు ఛాటింగ్ న‌డుస్తుంది. చివ‌ర‌కు త‌న ప్రేమ‌ను ఓ క‌విత రూపంలో లీలాకు వ్య‌క్త ప‌రుస్తాడు ప్ర‌సాద్‌. కానీ లీలా నుంచి రిప్లై రాదు? ఆ త‌ర్వాత ఏమైంది? ప్ర‌సాద్ ప్ర‌పోజ‌ల్‌కు లీలా రిప్లై ఎందుకు ఇవ్వ‌లేదు? లీలా స‌మాధానం కోసం ఎదురుచూస్తూ ప్ర‌సాద్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌ను ఎదుర్కొన్నాడు? అన్న‌దే లీలావినోదం మూవీ క‌థ‌.

సోష‌ల్ మీడియా లేని యుగంలో...

ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి సోష‌ల్ మీడియాతో పాటు వీడియో కాల్స్‌, ట‌చ్ ఫోన్‌, ఇంట‌ర్‌నెట్ లేని రోజుల్లో ప్రేమికులకు మ‌ధ్య వార‌ధిగా స్లామ్స్ బుక్స్‌, గ్రీటింగ్ కార్డ్స్ ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డేవి. అలాంటి టైమ్‌లో సాగే క్యూట్ ల‌వ్‌స్టోరీగా లీలా వినోదం సాగుతుంది. అప్పుడ‌ప్పుడే మొబైల్స్ ఎంట్రీ ఇస్తోన్న టైమ్‌లో త‌న ప్రేమ‌కు ఓ అమ్మాయి నుంచి ఎలాంటి ఆన్స‌ర్ వ‌స్తుందోన‌ని ఓ యువ‌కుడు కొన్ని గంట‌ల పాటు ప‌డే సంఘ‌ర్ష‌ణ‌, త‌ప‌న‌ను ఫ‌న్‌, ఎమోష‌న్స్ జోడించి ఈ మూవీలో చూపించాడు డైరెక్ట‌ర్‌.

నాచుర‌ల్ ల‌వ్ స్టోరీ...

సినిమాలా కాకుండా నిజంగానే ఓ న‌లుగురు స్నేహితులు క‌లిసి కూర్చుండి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఈ మూవీ. స్నేహితుల మ‌ధ్య ఉండే చిన్న చిన్న తాగాదాలు, ఒక‌రిపై మ‌రొక‌రు వేసుకునే సైట‌ర్లు, పంచ్‌లు హీరోపై జెల‌సీతో అత‌డి ఆనందాన్నిచెడొగొట్ట‌డానికి ప‌క్కింటి కుర్రాడు చేసే ప్ర‌య‌త్నాల‌తో చాలా నాచుర‌ల్‌గా ఈ మూవీ సాగుతుంది.

సినిమాటిక్ డైలాగ్స్‌, హీరోయిజం ఛాయ‌లు, రొమాంటిక్ డ్యూయెట్‌లు లీలా వినోదంలో క‌నిపించ‌వు. క్లైమాక్స్ కూడా మెద‌డుకు ప‌దును పెట్టే ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా ఎండ్ చేశాడు డైరెక్ట‌ర్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా టైమ్‌లో క‌థ సాగిన‌ట్లుగా చూపించ‌డం బాగుంది.

కొత్త‌దేమీ కాదు...

లీలా వినోదం కాన్సెప్ట్ కొత్త‌దేమీ కాదు. హీరోయిన్‌ను మూగ‌గా ప్రేమించే హీరో క‌థ‌ల‌తో ఎన్నో సినిమాలు తెలుగులో వ‌చ్చాయి. లీలా వినోదం హీరో క్యారెక్ట‌ర్ ప్ర‌ధానంగానే సాగుతుంది. అత‌డే ప‌డే సంఘ‌ర్ష‌ణ తాలుకు స‌న్నివేశాలు రిపీటెడ్‌లా అనిపిస్తాయి. క్లైమాక్స్‌ను ఇంకాస్త క‌న్వీన్సింగ్‌గా రాసుకుంటే బాగుండేది.

వ‌న్ సైడ్ ల‌వ‌ర్‌...

హీరోహీరోయిన్లు ఎలా చేశారంటే...ప్ర‌సాద్ అనే వ‌న్‌సైడ్ ల‌వ‌ర్‌గా ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ స‌హ‌జ న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. అత‌డి డైలాగ్ డెలివ‌రీ, కామెడీ టైమింగ్ బాగున్నాయి. హీరోయిన్ అన‌ఘా అజిత్ క్యారెక్ట‌ర్ గ‌ట్టిగా సినిమా మొత్తంలో ప‌ది నిమిషాల‌కు మించి క‌నిపించ‌దు. కొన్ని కామెడీ సీన్స్ త‌గ్గించి హీరోహీరోయిన్ల ల‌వ్ ట్రాక్ పెంచితే బాగుండేది.

హీరో స్నేహితుడిగా న‌టించిన వారిలో రాజేష్ క్యారెక్ట‌ర్ హిలేరియ‌స్‌గా వ‌ర్క‌వుట్ అయ్యింది. హీరోను క‌న్ఫ్యూజ్ ఫ్రెండ్‌గా చివ‌రి వ‌ర‌కు న‌వ్వించాడు. ఆమ‌ని, గోప‌రాజు ర‌మ‌ణ గెస్ట్ రోల్స్ చేశారు.

చాలా చిన్న పాయింట్‌ను కామెడీ జోడించి ఎలాంటి బోర్ లేకుండా చెప్ప‌డంలో ప‌వ‌న్ సుంక‌ర కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు.

టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌...

లీలా వినోదం సింపుల్ ల‌వ్‌స్టోరీతో సాటే టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. సినిమా నిడివి గంట‌న్న‌ర మాత్ర‌మే.

Whats_app_banner