Nellore Crime : నెల్లూరు జిల్లాలో ఘోరం - యువతిపై నలుగురు అత్యాచారం!
నెల్లూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ యువతిపై ఒకే ఇంట్లో నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారం చేశారు. తీరా విషయం బయటికి రావటంతో బాధితురాలి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు… నలుగురిని అరెస్ట్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. యువతిపై ఒకే ఇంట్లో నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారం చేశారు. నిందితులు నలుగురు అన్నదమ్ములు, స్నేహితులే. అయితే ఈ కేసులో పోలీసులు అలసత్వం ప్రదర్శించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు గోప్యంగా ఉంచడంపై అనుమానాలకు తావిచ్చింది. చివరికి శుక్రవారం బయటకు పొక్కడంతో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ ఘటన నెల్లూరు రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు రూరల్‌లో ఓ ప్రాంతానికి చెందిన యువతి (19) ప్రతి ఆదివారం చర్చికి వెళ్తూ వచ్చేది. చర్చికి వెళ్లే క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో ఆ యువతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఇంటికి వెళ్లేంత దగ్గరగా స్నేహితులు అయ్యారు. దీంతో ఎప్పటికప్పుడు మహిళ ఇంటికి ఆ యువతి వెళ్లేది.
మహిళ ఇంట్లో ఉంటున్న అన్నదమ్ములు, స్నేహితులు నలుగురు నిఖిల్, సునీల్, సన్నీ, నవీన్ ఆ యువతితో పరిచయం పెంచుకున్నారు. ఆ యువతిని ఒకరికి తెలియకుండా ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఈ వ్యవహారం జరుగుతోంది. అయినప్పటికీ ఈ విషయం బయటపడలేదు. యువతి శరీరంలో మార్పులను గమనించిన బంధువులు నిలదీశారు. అప్పుడు యువతి జరిగిన విషయం మొత్తం బంధువులకు వివరించింది.
దీంతో అత్యాచారం జరిగినట్లు గుర్తించి నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 22న ఫిర్యాదు చేయగా, అదే రోజు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘోరమైన సంఘటన గురించి పోలీసులు గోప్యంగా ఉంచడంతో అనుమానాలకు తావిచ్చింది. నిందితులను కాపాడేందుకే అలా చేశారని ఆరోపణలు వినిపించాయి. ఆ క్రమంలోనే ఈ నెల 22న కేసు నమోదు చేసినా… విషయం బయటకు పొక్కనివ్వలేదు.
చివరకు సిబ్బందికి కూడా విషయం తెలియకుండా.. తెలిసిన సిబ్బందితో సమాచారం బయటకు వస్తే చర్యలు తప్పవని సూచించడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. స్పెషల్ బ్రాంచి పోలీసులు సైతం ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. దీంతో పోలీసులపై విమర్శలు వచ్చాయి. అయితే శుక్రవారం ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు నలుగురు నిందితులు నిఖిల్, సునీల్, సన్నీ, నవీన్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.