OTT: మరో ఓటీటీలోకి వచ్చిన 11వేల కోట్ల బ్లాక్‍బస్టర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
OTT: హాలీవుడ్ బ్లాక్‍బస్టర్ చిత్రం బార్బీ మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.11వేల కోట్లతో దుమ్మురేపిన ఈ చిత్రం మరో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
హాలీవుడ్‍లో బార్బీ చిత్రం సెన్సేషనల్ హిట్ కొట్టింది. 2023 జూలై 21వ తేదీన ఈ ఫ్యాంటసీ కామెడీ మూవీ విడుదలైంది. క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఓపెన్‍హైమర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగింది. ఆ చిత్రం ఎక్కువ కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2023లో అత్యధిక కలెక్షన్లు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. బార్బీ చిత్రం ఇప్పుడు మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది.
ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..
బార్బీ చిత్రం తాజాగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే జియోసినిమా ఓటీటీలో బార్బీ చిత్రం ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. గతేడాదిలోనే స్ట్రీమింగ్‍కు వచ్చింది.
అయితే, ఇప్పుడు సంవత్సరం తర్వాత నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ బార్బీ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ ప్లాట్‍ఫామ్‍లో ఇంగ్లిష్‍తో పాటు హిందీలోనూ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు జియోసినిమాతో పాటు నెట్‍ఫ్లిక్స్‌లోనూ ఈ సూపర్ హిట్ మూవీని చూడొచ్చు.
బార్బీ కలెక్షన్లు
బార్బీ సినిమా బార్బీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 1.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11వేల కోట్లు) కలెక్షన్లు దక్కించుకుంది. అంచనాలకు మించి బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. ఓపెన్‍హైమర్‌ను అధిగమించి వావ్ అనిపించింది. వరల్డ్ వైడ్‍లో క్రేజ్ దక్కించుకుంది. బార్బీ చిత్రం 145 మిలియన్ డాలర్ల (రూ.1,200కోట్లు) బడ్జెట్‍తో రూపొంది.. సుమారు రూ.11వేల కోట్ల వసూళ్లను రాబట్టి అద్భుతం చేసింది.
బార్బీ చిత్రానికి గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంతో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లారు. ఈ మూవీలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్‍కినోన్, ఇకా రయీ, అమెరికా ఫెరేరా, సిమూ లియూ, దుయా లిపా, మైకేల్ సెరా, హెలెన్ మిర్రెన్ ప్రధాన పాత్రలు పోషించారు.
బార్బీ మూవీని హేడే ఫిల్మ్స్, లక్కీచాంప్ ఎంటర్‌టైన్‍మెంట్, ఎన్‍బీజీజీ పిక్చర్స్, మెట్టెల్ ఫిల్మ్స్ పతాకాలు సంయుక్తంగా నిర్మించాయి. మార్క్ రాన్సన్, ఆండ్రూ వ్యాట్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. బార్బీ మూవీకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఓ ఆస్కార్ దక్కింది.