Ashwin Father: బాక్సింగ్ డే టెస్టు కోసం ఫ్లైట్ టికెట్ కొని క్యాన్సిల్ చేసుకున్న అశ్విన్ తండ్రి-r ashwin father booked flight tickets to melbourne for boxing day test later canceled it ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin Father: బాక్సింగ్ డే టెస్టు కోసం ఫ్లైట్ టికెట్ కొని క్యాన్సిల్ చేసుకున్న అశ్విన్ తండ్రి

Ashwin Father: బాక్సింగ్ డే టెస్టు కోసం ఫ్లైట్ టికెట్ కొని క్యాన్సిల్ చేసుకున్న అశ్విన్ తండ్రి

Hari Prasad S HT Telugu
Dec 20, 2024 03:10 PM IST

Ashwin Father: అశ్విన్ తండ్రి బాక్సింగ్ డే టెస్టు చూడటానికి మెల్‌బోర్న్ కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడట. మూడో టెస్టు ముగిసిన తర్వాత అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని తండ్రి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లు తెలిసింది.

బాక్సింగ్ డే టెస్టు కోసం ఫ్లైట్ టికెట్ కొని క్యాన్సిల్ చేసుకున్న అశ్విన్ తండ్రి
బాక్సింగ్ డే టెస్టు కోసం ఫ్లైట్ టికెట్ కొని క్యాన్సిల్ చేసుకున్న అశ్విన్ తండ్రి

Ashwin Father: అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం అభిమానులనే కాదు అతని కుటుంబాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే అతడు రిటైర్మెంట్ ప్రకటించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. చివరికి అశ్విన్ కుటుంబ సభ్యులకు కూడా ఈ నిర్ణయం తెలియదని తాజాగా వస్తున్న వార్తల ప్రకారం స్పష్టమవుతోంది. మెల‌బోర్న్ లో జరగబోయే బాక్సింగ్ డే టెస్టు కోసం అశ్విన్ తండ్రి టికెట్లు బుక్ చేసుకున్నా.. తర్వాత రద్దు చేసుకోవడం గమనార్హం.

తుది జట్టులోకి వస్తాడనుకుంటే..

తొలి, మూడో టెస్టుకు అశ్విన్ ను తుది జట్టులో ఆడించలేదు. కనీసం అతడు నాలుగు, ఐదు టెస్టుల్లో ఆడతాడన్న నమ్మకంతో మెల్‌బోర్న్, సిడ్నీ మ్యాచ్ ల కోసం అశ్విన్ తండ్రి రవిచంద్రన్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడట. అయితే అశ్విన్ సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ టికెట్లను రద్దు చేసుకున్నాడు.

నిజానికి గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాతే రిటైరవ్వాలని అశ్విన్ భావించాడట. కానీ ఈసారి ఆస్ట్రేలియాలో సత్తా చాటి ఆటకు వీడ్కోలు పలకాలని భావించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన రిపోర్టు తెలిపింది. ఆస్ట్రేలియా వెళ్లే ముందు కూడా అతడు రెండు ఆలోచనలతో ఉన్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.

అశ్విన్‌ను అవమానించారా?

అయితే అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని తండ్రి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. అతడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడని రవిచంద్రన్ అనడం గమనార్హం. "చివరి నిమిషంలోనే నాకూ ఈ విషయం తెలిసింది. అతడు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. అశ్విన్ కే తెలియాలి.

అవమానాలు కూడా కావచ్చు" అని రవిచంద్రన్ న్యూస్ 18తో అనడం షాక్ కు గురి చేసింది. అయితే ఈ కామెంట్స్ పై స్పందించిన అశ్విన్.. దీనిని సరదాగా తీసుకోవాలంటూ ట్వీట్ చేశాడు. మీడియాతో మాట్లాడటం ఆయనకు రాదని, అతన్ని క్షమించి, ఒంటరిగా వదిలేయాలంటూ లాఫింగ్ ఎమోజీలను అశ్విన్ పోస్ట్ చేశాడు.

అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ కు మాత్రమే ముందుగా తెలిసినట్లు అనిపిస్తోంది. తాను పెర్త్ లో అడుగుపెట్టగానే తనకీ విషయం తెలుసని, పింక్ బాల్ టెస్టుకు ఉండేందుకు అశ్విన్ ను ఒప్పించాల్సి వచ్చిందని కెప్టెన్ రోహిత్ అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. క్లబ్ క్రికెట్ లో మాత్రం అశ్విన్ కొనసాగనున్నాడు. సాధ్యమైనన్ని రోజులు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడతానని అతడు స్పష్టం చేశాడు.

Whats_app_banner