Snacks with Idly: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా..? అయితే ఇలా కరకరలాడే స్నాక్స్ చేసి పిల్లలకు ఇవ్వండి, మిగల్చకుండా తినేస్తారు
Snacks with Idly: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ కోసం తయారు చేసిన ఇడ్లీలు అప్పుడప్పుడు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయకుండా సాయంత్రం రుచికరమైన స్నాక్స్ చేసుకోవచ్చు. కేవలం 15నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన కరకరలాడే స్నాక్స్ తయారుచేయచ్చు. పిల్లలకు ఇవ్వచ్చు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ కోసం తయారు చేసిన ఇడ్లీలో చాలా సందర్భాల్లో మిగిలిపోతుంటాయి. వాటిని మధ్యాహ్నం, సాయంత్రం తినలేము. అలాగని పడేయడానికి మనసు ఒప్పదు. ఏం చేయాలి అని ఆలోచించే గృహిణులు ఎందరో ఉంటారు. అలాంటి వారికోసం ఈ ఇడ్లీ పిండి స్నాక్స్. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసినా, మధ్యాహ్నానికి లంచ్ పెట్టి పంపించినా మళ్లీ సాయంత్రానికి స్నాక్స్ తినకుండా ఊరుకోరు ఇంట్లో వాళ్లు. స్నాక్స్ కోసం మళ్లీ ప్రత్యేకంగా ప్లాన్ చేసి తయారు చేసేకన్నా ఉదయం మిగిలిన ఇడ్లీల తోనే ఇలా కరకరలాడే స్నాక్స్ చేసి ఇవ్వండి. తెలియకుండానే బాగా తినేస్తారు పైగా థాంక్స్ చెప్పి మిమ్మల్ని పొగిడేస్తారు. అంతేకాదు ఇడ్లీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ఈ స్నాక్స్ కూడా అంతే మేలు చేస్తాయి.
ఇడ్లీతో స్నాక్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:
ఇడ్లీలు - ఉదయం మిగిలిన రెండు లేదా మూడు ఇడ్లీలు(ముక్కులుగా చేసి పక్కక్కు పెట్టుకోవాలి)
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు- రుచికి సరిపడా(ఇడ్లీలో ఆల్రెడీ ఉంటుంది కనుక కాస్త తక్కువగా వేసుకోవాలి)
కారంపొడి- 1/4 టీ స్పూన్
మిరియాల- పొడి చిటికెడు
తయారీ విధానం:
ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి
నూనె బాగా వేడిక్కిన తర్వాత అందులో మక్కులుగా చేసి పక్కక్కు పెట్టుకున్న ఇడ్లీలను వేసి కరకరలాడే వరకూ వేయించాలి.
వేగిన ఇడ్లీ ముక్కలను తీసి పక్కక్కు పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి వేయించిన ఇడ్లీ ముక్కలను దాంట్లో వేయాలి.
ఈ ముక్కల మీద చిటికెడు ఉప్పు, పావు టీ స్పూన్ కారంపొడి, చిటికెడు మిరియాల పొడి వేయాలి.
ఇడ్లీ ముక్కలకు ఉప్పు, కారం, మిరియాల పొడి మొత్తం పట్టేలాగా బాగా కలుపుతూ వేయించాలి.
కావాలంటే దీంట్లో కరివైపాకు, కొత్తిమీర వంటివి కూడా వేసుకోవచ్చు.
అంతే ఇడ్లీ పిండితో కరకరలాడే స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. పిల్లలు స్కూలు నుంచి వచ్చే సరికి చేసి పెట్టేయండి.