Pawan Kalyan : నాకు బుగ్గలు నిమరడం.. తల నిమరడం తెలీదు : పవన్ కళ్యాణ్
Pawan Kalyan : పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు తల నిమరడం, బుగ్గలు నిమరడం తెలియదని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ఒళ్లు వంచి పనిచేయడం మాత్రమే తెలుసని స్పష్టం చేశారు. జిల్లాలో పలు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు.
మీ కోసం పని చేసే వ్యక్తుల సమూహాన్ని మీరు ఎన్నుకున్నారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారం లేనప్పుడు మన మన్యం ప్రాంతంలో తిరిగానని.. తనకు బుగ్గలు నిమరడం, తల నిమరడం తెలీదన్నారు. తాను దూరంగా ఉన్నా.. ప్రజల కోసం నిరంతరం పరితపించే వ్యక్తినని స్పష్టం చేశారు. గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్డు నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సమస్యలు చూశాను..
'నా పేషికి కూడా ఒకటే మాట చెప్పాను. రెండు నెలలకొకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి అని. గిరిజన ప్రజలందరికీ మాటిస్తున్నాను, నేను మీకోసం ఒళ్లు వంచి పని చేస్తాను. పోరాట యాత్రలో ఇక్కడ పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు మూడు ప్రధాన సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఒకటి రోడ్లు, రెండు తాగు నీరు, మూడు యువతకి ఉపాధి అవకాశాలు' అని పవన్ కళ్యాణ్ వివరించారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి..
'దాదాపు ఇక్కడ 20 కి పైగా జలపాతాలు ఉన్నాయి. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నిటిలో అధ్బుతమైన ప్రకృతి సౌందర్యం ఉంది. ఇక్కడ టూరిజంని అభివృద్ధి చెయ్యాలి. ఈ రోడ్డు వేయడానికి రూ.9.30 కోట్ల ఖర్చు అవుతోంది. నేను అన్యాయం అయిపోయాను అని చెప్పిన బిడ్డ.. మీదగ్గర ఓట్లు వేయించుకుని 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. రుషికొండ ప్యాలెస్‌కి రూ.500 కోట్లు ఖర్చుపెట్టారు. కానీ మన గిరిజన ప్రాంతం బాగుజోలలో రూ.9.50 కోట్లతో రోడ్లు వేయలేకపోయారు' అని డిప్యూటీ సీఎం విమర్శించారు.
మాట ఇస్తున్నా..
'గిరిజన ప్రజలందరికీ, మన్యం ప్రాంతం ప్రజలందరికీ కూటమి ప్రభుత్వం తరఫున మాట ఇస్తున్నాను. మీకోసం అహర్నిశలు ఎండనకా, వాననకా కష్టపడటానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇందాక కలెక్టర్ వర్షం పడుతుంది కొంచెం సేపు ఆగుదాం అన్నప్పుడు ఒకటే మాట చెప్పాను. ఒక కిలోమీటరు అయినా నడిస్తే కానీ వారి సాధకబాధకాలు నాకు తెలియాలి. ఒక నలుగురు ఒక డోలిలో గర్భిణీ స్త్రీని మోసుకుంటూ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడతారో తెలియాలి అంటే.. నేను నడవాలి అని చెప్పాను' అని ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
మీ కష్టాలు తీర్చడానికి..
'ప్రజల కష్టాలు తీర్చమని కోరి తిరుమల కొండ ఎక్కాను. నేను ఈ రోజున అలా మన కొండ ఎక్కాను. మన కష్టాలు తీరడానికి పని చేస్తాను. మీరు రోడ్డు వేసేలోపు కనీసం రోడ్డు రొలర్లతో చదును చేయించమని అధికారులకు ఆదేశించాను. 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు వచ్చేలోపు మట్టి రోడ్డు వేయమని చెప్పాను. ఈరోజైతే తుపాను ఉంది కానీ.. శీతాకాలం కాబట్టి నిర్మాణం ప్రారంభించమన్నాను. దాన్ని కూడా నేనే ఉపముఖ్యమంత్రి పేషీ నుండి పర్యవేక్షిస్తాను' అని పవన్ స్పష్టం చేశారు.
గతంలో ఎవరైనా వచ్చారా..
'గతంలో ఒక్క మంత్రి అయినా వచ్చాడా? నేను అధికారం రాక మునుపు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చాక కూడా నేను మీకోసమే పని చేస్తాను. మన మన్యం ప్రాంతం యువతకి మాటిస్తున్నాను. ఇక్కడ టూరిజం వైపు కానీ ఇతర మార్గాల ద్వారా కానీ మీకు ఉపాధి మార్గం కనిపెడతాం. అందుకే 2 నెలలకొకసారి 3 రోజుల పర్యటన పెట్టుకుంటాను' అని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
అభివృద్ధి మర్చిపోతున్నారు..
'సినిమాల కోసం అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు. సినిమాలు సరదాలకి వెచ్చించాలి అంటే డబ్బులు ఉండాలి. మీలో సమర్ధత, ఉపాధి అవకాశాలు ఉండాలి కదా? 2017లో మాట ఇచ్చా, నిలబడ్డా. వెనక్కి వెళ్ళను. ఈరోజు ఇంకో మాట ఇస్తున్నాను. ఇక్కడికి నేను కేవలం రోడ్ల కోసమే రాలేదు. మీ కష్టాలు బాధలు తెలియాలి. యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలి అనేవి తెలుసుకోవాలి. ఇది నేను 5 సంవత్సరాల తరువాత కోసం చెప్పట్లా. వచ్చే సంవత్సరం లోపు ఏమి చేస్తే బాగుంటది అని ఆలోచిస్తున్నాను' అని వ్యాఖ్యానించారు.