Mohan Babu: చిరంజీవి పేరుని ప్రస్తావిస్తూ మోహన్ బాబు ట్వీట్.. మరిచిపోలేని జ్ఞాపకం
Mohan Babu: మోహన్ బాబు, చిరంజీవి చాలా సినిమాల్లో కలిసి నటించారు. కానీ.. 1982లో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా తనకి బాగా ఇష్టమైనదని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. కెరీర్ తొలినాళ్లలో ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించగా.. ఆ తర్వాత ఓ అవార్డు ఫంక్షన్‌లో ఇద్దరి మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే.. గత కొన్ని రోజుల నుంచి తన పాత సినిమా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న మోహన్ బాబు.. తాజాగా ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ సినిమా గురించి ప్రస్తావించారు.
బ్రదర్స్‌గా మోహన్ బాబు, చిరంజీవి
1982లో వచ్చిన ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ మూవీలో చిరంజీవి, మోహన్ బాబు అన్నదమ్ములుగా నటించారు. దాంతో ఆ సినిమా గురించి తాజాగా ప్రస్తావించిన మోహన్ బాబు.. ఆ సినిమాలో తనది మరిచిపోలేని పాత్ర అని గుర్తు చేసుకున్నారు. అలానే డైరెక్టర్ మౌలీ తన పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దాడని కొనియాడిన మోహన్ బాబు.. చిరంజీవికి బ్రదర్‌గా నటించడం మంచి అనుభూతిగా చెప్పుకొచ్చారు. చిరంజీవి, మోహన్ బాబులకి జంటగా ఈ మూవీలో రాధిక, గీత నటించారు.
ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అప్పట్లో వచ్చిన పట్నం వచ్చిన పతివ్రతలు మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. పల్లెటూరి జీవితం నచ్చని భార్యలుగా నటించిన రాధిక, గీత.. భర్తలకి చెప్పకుండా పట్నం వెళ్లిపోతారు. అక్కడ వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనేది సినిమా. అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా..ఫ్యామిలీ ఆడియెన్స్‌కి విపరీతంగా నచ్చింది.
వరుస వివాదాల్లో మంచు ఫ్యామిలీ
వాస్తవానికి గత రెండు వారాలుగా మోహన్ బాబు ఫ్యామిలీ వరుస వివాదాల్లో ఉంది. మంచు మనోజ్‌తో గొడవ.. టీవీ రిపోర్టర్‌పై దాడి కేసులతో మోహన్ బాబు చిక్కులు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ.. తన పాత సినిమాల్ని గుర్తు చేసుకుంటూ ఎక్స్‌లో వరుసగా పోస్ట్‌లు పెడుతున్నారు. మరోవైపు మంచు మనోజ్, మంచు విష్ణు కూడా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ.. పోలీసులపై ఫిర్యాదు చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం మంచు మనోజ్‌ది తప్పు అంటూ మోహన్ బాబు భార్య నిర్మలాదేవి ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే.