Male Infertility: పురుషులు చేసే ఈ ఐదు పొరపాట్లు వారికి పిల్లలు పుట్టకుండా చేస్తాయి..!
Male Infertility: పురుషుల తమ దైనందిక జీవితంలో చేసే కొన్ని పొరపాట్లే వారికి సంతానం కలగకుండా చేస్తున్నాయి. సంతానోత్పత్తి కోసం తపిస్తున్నట్లయితే వారిలో ఈ అలవాట్లు అస్సలు ఉండకూడదు. ఇవి వారి సంతానోత్పత్తిపై కచ్చితంగా చెడు ప్రభావాన్నిచూపుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ అలవాట్లు ఏవో చూద్దాం.
నేటి జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు సంతానలేమి బారిన పడుతున్నారని ఆరోగ్యంపై అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందుకు కారణం వారి దైనందిక జీవితంలో చేస్తున్న కొన్ని పొరపాట్లని కూడా అవి తేల్చి చెబుతున్నాయి. సంతానోత్పత్తి సమస్యను నివారించడానికి పురుషులు వారి దైనందిన జీవితానికి సంబంధించిన ఈ 5 చెడు అలవాట్లను మార్చుకోవడం అవసరం. పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపే 5 చెడు అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
1. ఆహారం విషయంలో..
మీరు మీ సంతానోత్పత్తిని కాపాడుకోవాలనుకుంటే, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం మానుకోండి. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసం తిన్న పురుషులు, సాధారణ ఆహారం తినే వారి కంటే తక్కువ స్పెర్మ్ కణాలను కలిగి ఉంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, ప్రాసెస్ చేసిన మాంసం అధికంగా తీసుకోవడం కొలొరెక్టల్, పెద్దప్రేగు, మల, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
2. శరీర బరువు విషయంలో..
ఊబకాయం కేవలం వ్యక్తిత్వాన్ని పాడు చేయడమే కాకుండా పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అధిక బరువు, తక్కువ బరువు ఉన్న పురుషులు ఇద్దరూ సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నారని స్టడీలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్న పురుషులు సాధారణ బరువు ఉన్న పురుషుల కంటే తక్కువ స్పెర్మ్ కౌంట్ కలిగి ఉండటానికి 42 శాతం ఎక్కువ అవకాశం ఉంది. వారి వీర్యంలో వీర్యకణాలు ఉత్పత్తి కాకుండా ఉండే అవకాశాలు 81 శాతం వరకు ఉంటాయి. అటువంటి పరిస్థితిలో, మీ నిశ్చల జీవనశైలిని విడిచిపెట్టి, స్థూలకాయాన్ని నియంత్రించడానికి క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయండి.
3. ఒత్తిడి సమస్య..
ఆఫీసులో టెన్షన్ లేదా ఇంట్లో ఏదైనా సమస్య కావచ్చు ఏ విషయంలో అయినా అధిక ఒత్తిడి తీసుకోవడం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇది మగ సంతానోత్పత్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. అధిక ఒత్తిడి, టెన్షన్, ఆందోళన, నిరాశ వంటివి మానసిక ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తాయి, ఇది కొన్నిసార్లు సంతానోత్పత్తి, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరగడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే పురుషులలో అలసట, శక్తిహీనత, లైంగిక కోరిక తగ్గుదల వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.
4. విద్యుదయస్కాంత క్షేత్రాల ప్రభావం..
ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేసే చాలా మంది పురుషులు ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని పని చేస్తున్నారు. ల్యాప్ టాప్ లను ఎక్కువ సేపు ఒడిలో ఉంచడం వల్ల పురుషుల సంతానోత్పత్తిపై చెడు ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ల్యాప్టాప్లు, విద్యుదయస్కాంత క్షేత్రాల నుంచి వెలువడే వేడి హైపర్థెర్మియాకు కారణమవుతుందని 2024లో జరిపిన పరిశోధనలో తేలింది. వాస్తవానికి, ఉష్ణోగ్రతలో ఆకస్మిక పెరుగుదల, ఆక్సీకరణ ఒత్తిడి డిఎన్ఏను దెబ్బతీయడం ద్వారా స్పెర్మ్ నాణ్యతను క్షీణిస్తుంది. సంతాన అవకాశాలు తగ్గుతాయి.
5. ధూమపానం, మద్యపానం
మద్యపానం ధూమపానం అనేవి వీర్యం పరిమాణం, నాణ్యతను తగ్గిస్తుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ ను తగ్గిస్తుంది. ధూమపానం స్పెర్మ్ డిఎన్ఎను కూడా దెబ్బతీస్తుంది. ధూమపానం, మద్యపానం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. టెస్టోస్టెరాన్ లైంగిక కోరికను పెంచడానికి అవసరమైన హార్మోన్. సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు వీటి జోలికి పోకుండా ఉంటేనే మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే మేము ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం