Yoga Pose: శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఆసనం.. చేయడం ఈజీ.. ప్రయోజనాలు చాలా!-how to do supta baddha konasana harmonal balance to stress reduce know the benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Pose: శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఆసనం.. చేయడం ఈజీ.. ప్రయోజనాలు చాలా!

Yoga Pose: శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఆసనం.. చేయడం ఈజీ.. ప్రయోజనాలు చాలా!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 10, 2024 06:00 AM IST

Yoga Pose: శరీరంలో హార్మోన్ల అసమతుల్యత తగ్గేలా ఓ యోగాసనం తోడ్పడుతుంది. ఈ ఆసనం చేయడం కూాడా చాలా సులభం. ఈ ఆసనంతో శరీరానికి చాలా లాభాలు ఉన్నాయి. ఆ వివరాలివే..

Yoga Pose: శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఆసనం.. చేయడం ఈజీ.. ప్రయోజనాలు చాలా!
Yoga Pose: శరీరంలో హార్మోన్లను బ్యాలెన్స్ చేసే ఆసనం.. చేయడం ఈజీ.. ప్రయోజనాలు చాలా!

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత చాలా మంది ఆరోగ్యాలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత బిజీ జీవితాలు, జీవన శైలి వల్ల ఈ సమస్య అధికమవుతోంది. హార్మోన్ల బ్యాలెన్స్ సరిగా లేకపోతే శరీరంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. హార్మోన్ల బ్యాలెన్స్ కోసం మందులు ఉన్నాయి. అయితే, ఓ యోగాసనం కూడా హార్మోన్లు బ్యాలెన్స్‌గా ఉండేందుకు తోడ్పడుతుంది. ఈ ఆసనం పేరు సుప్త బద్ధ కోణాసనం.

yearly horoscope entry point

సుప్త బద్ధ కోణాసనం హార్మోన్లను నియంత్రించగలదు. కటి (పెల్విక్) సహా వివిధ అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరచగలదు. ఒత్తిడిని తగ్గిస్తుంది. టెస్టోస్టిరాన్‍ను కూడా నియంత్రించగలదు. ఈ ఆసనం ఎలా వేయాలో, లాభాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

సుప్త బద్ధ కోణాసనం వేయండిలా..

  • సుప్త బద్ధ కోణాసనం వేసేందుకు, ముందుగా ఓ చోట వెల్లకిలా పడుకోవాలి.
  • ఆ తర్వాత రెండు మోకాళ్లను పక్కలకు మడవాలి. రెండు పాదాలను ఒకదానికి ఒకటి తాకించాలి.
  • పాదాలను తాకించిన తర్వాత వాటిని వీలైనంత వరకు శరీరంపైవు తీసుకొచ్చేలా ఒత్తిడి చేయాలి.
  • అర చేతులు పైకి ఉండేలా చేతులను వెనక్కి తీసుకెళ్లి నేలకు ఆనించాలి.
  • ఆ భంగిమలో శ్వాస తీసుకుంటూ వదలాలి.
  • ఈ సుప్త బద్ధ కోణాసనం భంగిమలో సుమారు 5 నుంచి 10 నిమిషాలు ఉండాలి.

 

సుప్త బద్ధ కోణాసనం ప్రయోజనాలు

రక్త ప్రసరణ: సుప్త బద్ధ కోణాసనం వేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ముఖ్యంగా కటి, పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీనివల్ల హార్మోన్ల ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అవయవాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగ్గా ఉందేలా కూడా ఈ ఆసనం చేయగలదు.

ఒత్తిడి తగ్గుతుంది: సుప్త బద్ధ కోణాసనం వేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. కార్టిసాల్ లాంటి హార్మోన్లు రిలీజ్ అవడం వల్ల ఒత్తిడి పెరిగి, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడే రిస్క్ ఉంటుంది. దీన్ని ఈ ఆసనం తగ్గించలదు.

జీర్ణం మెరుగ్గా..: సుప్త బద్ధ కోణాసనం వల్ల పొత్తి కడుపుకు మసాజ్ చేసినట్టుగా ఉంటుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థలో అవయవాలకు ప్రేరణ కలుగుతుంది. దీంతో ఆహారం మెరుగ్గా జీర్ణమయ్యే అవకాశాలు ఉంటాయి.

నిద్రకు మేలు: నిద్రలేమి సమస్యను కూడా ఈ ఆసనం తగ్గిస్తుంది. నాణ్యమైన నిద్ర పట్టేలా చేయగలదు. మానసిక ప్రశాంతత పెంచడం, హర్మోన్ల సమతుల్యతకు తోడ్పడి.. నిద్రకు కూడా ఉపకరిస్తుంది.

నడుము నొప్పి: సుప్త బద్ధ కోణాసనం వల్ల వెన్నుపై కూడా ఒత్తిడి ఉంటుంది. దీంతో నడుము నొప్పి తగ్గేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలిగించగలదు.

Whats_app_banner