Wife harassment: రూ.1.5 లక్షల మెయింటెనెన్స్, రూ.కోటి నష్టపరిహారం; భార్య వేధింపులను లింక్డ్ ఇన్ లో వివరించిన టెక్కీ
Wife harassment: భార్య వేధింపులతో బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. గురుగ్రామ్ కు చెందిన యూఎక్స్ డిజైనర్ ఒకరు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టాడు. వరకట్నం, గృహహింస వంటి తప్పుడు కేసుల ద్వారా తనను వేధిస్తున్నారని ఆ వ్యక్తి లింక్డ్ఇన్ పోస్టుల్లో ఆరోపించారు.
Wife harassment: భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులతో బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో.. గురుగ్రామ్ కు చెందిన యూఎక్స్ డిజైనర్ ఒకరు తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టాడు. వరకట్నం, గృహహింస వంటి తప్పుడు ఆరోపణలతో తన భార్య తనను వేధిస్తోందని ఆరోపించాడు. ఆ వివరాలతో లింక్డ్ఇన్ లో వరుస పోస్ట్ లు పెట్టారు. పెళ్లయిన ఆరు నెలలకే తాను, తన భార్య విడివిడిగా జీవించడం ప్రారంభించామని పేర్కొన్నాడు. అయితే అతని భార్య ఇప్పుడు నెలకు రూ.1.5 లక్షలు, పరిహారంగా రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
2023 నుంచి..
లింక్డ్ ఇన్ పోస్ట్ లో ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. 2023 మేలో ఢిల్లీలో వారి వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నాళ్లకే అతడు ఉద్యోగం కోల్పోయాడు. ఆ తరువాత మరో ఉద్యోగం కోసం అతడి భార్య అతడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. "కొన్ని రోజుల తరువాత, నేను తండ్రి కాబోతున్నానని నాకు తెలిసింది. కానీ నా భార్య నన్ను వీలైనంత త్వరగా, ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించమని ఒత్తడి చేసింది" అని అతను రాశాడు. ఐదు నెలల అన్వేషణ తర్వాత 2023 నవంబర్ లో అతడు బెంగళూరులో ఉద్యోగం సంపాదించాడు. అయితే గర్భవతిని అనే కారణం చూపి అతడి భార్య అతనితో కలిసి బెంగళూరు వెళ్లేందుకు నిరాకరించింది. బదులుగా, ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది.
ఆమె తల్లిదండ్రులు కూడా..
డెలివరీ తరువాత బెంగళూరు వస్తానని ఆమె అతడికి చెప్పింది. కానీ, ఆ తరువాత కూడా ఆమె రాలేదు. ఆమెను తిరిగి తీసుకురావడానికి అతడు 2023 డిసెంబర్ లో ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా అతడితో రావడానికి ఆమె నిరాకరించింది. పైగా బెంగళూరు జాబ్ మానేయమని ఒత్తిడి చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె, ఆమె తల్లిదండ్రులు అతడిపై మరింత రెచ్చిపోయారు. అతడితో పాటు అతడి 73 ఏళ్ల తల్లిని కూడా వేధించారు. ఢిల్లీ, బెంగళూరులో అతడి భార్య అతడిపై తప్పుడు కేసులు పెట్టింది.
కోటి పరిహారం డిమాండ్
తన భార్య ఒక కంపెనీలో అనలిస్ట్ గా పనిచేస్తోందని, నెలకు రూ.80,000 సంపాదిస్తోందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ నెలకు రూ.1.5 లక్షల మెయింటెనెన్స్, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని తనను డిమాండ్ చేస్తున్నారని వివరించాడు. తన 10 నెలల బిడ్డను కూడా చూడకుండా తన భార్య, ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని ఆ వ్యక్తి ఆరోపించాడు. ‘‘నా బలహీనత నా కొడుకే అని తెలుసుకుని, అతన్ని నాపై ఉపయోగించడం ప్రారంభించింది. నా కుమారుడిని చూడటానికి నేను వీడియో కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడల్లా, పిల్లవాడు నిద్రపోతున్నాడని చెప్పి ఆమె నిరాకరించింది’’ అని అతను చెప్పాడు. చివరకు, ఆమె తనపై తప్పుడు గృహహింస కేసు పెట్టిందని ఆ వ్యక్తి పేర్కొన్నారు.
సంవత్సరం నుంచి విడిగానే..
మెయింటెనెన్స్ కోరుతుంది, కానీ, విడాకులకు మాత్రం తన భార్య దరఖాస్తు చేయలేదని ఆ వ్యక్తి తెలిపారు. పెళ్లయి 18 నెలలు అయిందని, గత 13 నెలలుగా తను, తన భార్య విడిగానే ఉంటున్నామని చెప్పారు. "ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేస్తే, ఆమె వాటిని సులభంగానే పొందుతుంది. నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను. నేను పునర్వివాహం చేసుకుంటాను. పిల్లలను కంటాను. సంతోషకరమైన భవిష్యత్తును నిర్మించుకుంటాను. కానీ, అది ఆమెకు ఇష్టం లేదు. అందుకే తను నాకు విడాకులు ఇవ్వదు’’ అని వివరించాడు.