US Consulate in Bengaluru : త్వరలోనే బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభం.. ఇక వీసా కష్టాలు దూరం!-us consulate in bengaluru set to open in january says tejasvi surya and ambassador eric garcetti confirms ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Consulate In Bengaluru : త్వరలోనే బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభం.. ఇక వీసా కష్టాలు దూరం!

US Consulate in Bengaluru : త్వరలోనే బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభం.. ఇక వీసా కష్టాలు దూరం!

Sharath Chitturi HT Telugu

Bengaluru US consulate : భారత దేశ ఐటీ క్యాపిటల్​గా పేరు తెచ్చుకున్న బెంగళూరులో ఇప్పటివరకు యూఎస్​ కాన్సులేట్​ లేదు. ఇది ఐటీ ఉద్యోగులు చాలా ఇబ్బంది పెట్టింది. ఇక 2025 జనవరిలో బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ ఓపెన్​కానున్నట్టు ఎంపీ తేజస్వీ సూర్య ప్రకటించారు.

బెంగళూరులో త్వరలోనే యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభం!

బెంగళూరు ప్రజలకు గుడ్​ న్యూస్​! 2025 జనవరిలో నగరంలో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభంకానుంది. ఈ విషయాన్ని ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు. ఇదే విషయాన్ని భారత్​లోని అమెరికా రాయబారి ఎరిక్​ గార్సెట్టి కూడా ధ్రువీకరించారు.

“బెంగళూరు ప్రజలకు బిగ్​ అప్డేట్​! నగరంలో యూఎస్​ కాన్సులేట్​ ప్రారంభానికి జనవరిలో డేట్​ ఫిక్స్​ అయ్యింది. భారత ఐటీ క్యాపిటల్​గా, దేశ ఐటీ రెవెన్యూలో 40శాతం వాటా కలిగి ఉన్న బెంగళూరుకు ఇంతకాలం యూఎస్​ కాన్సులేట్​ లేదు. ఫలితంగా వీసా పని కోసం ఇక్కడి ప్రజలు చెన్నై లేదా హైదరాబాద్​కి వెళ్లాల్సి వస్తోంది. నగరానికి ఎంపీ అయిన తర్వాత బెంగళూరులో యూఎస్​ కాన్సులేట్​ని తీసుకురావడాన్ని మిషన్​గా పెట్టుకున్నాను. 2020లో అమెరికా అధికారులతో ఇదే విషయాన్ని చర్చించాను. ప్రధాని నరేంద్ర మోదీ 2023లో అమెరికాకు వెళ్లినప్పుడు, ఈ విషయాన్ని లేవనెత్తారు. ఇక ఇప్పుడు యూఎస్​ కాన్సులేట్​ కల సాకారం కానుంది. ఏళ్ల తరబడి ఉన్న డిమాండ్​ పూర్తవుతుండటం చాలా థ్రిల్లింగా ఉంది,” అని బెంగళూరు సౌత్​ ఎంపీ తేజస్వీ సూర్య ట్వీట్​ చేశారు.

బెంగళూరు వాసులు అమెరికా వీసా సంబంధిత పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. దీని కోసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతోంది. అమెరికాకు వెళ్లే విద్యార్థులు, టెక్కీలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ బెంగళూరులో ఇంతకాలం కాన్సులేట్ లేదు.

కనీసం నాలుగైదు లక్షల మందికి నగరంలో వీసా సంబంధిత పనులు చేసుకోవడానికి అమెరికా కాన్సులేట్ సహాయపడుతుందని తేజస్వీ సూర్య అభిప్రాయపడ్డారు.

“తాజా ప్రకటన పట్ల మేము పూర్తిగా సంతోషంగా ఉన్నాము. ఇది సాధ్యమైనందుకు నేను ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బెంగళూరులోని యూఎస్ కాన్సులేట్ ప్రతి సంవత్సరం కర్ణాటకలోని నాలుగైదు లక్షల మందికి.. రాష్ట్రం దాటి ప్రయాణించకుండా వీసా స్టాంపింగ్ చేయించుకోవడానికి సహాయపడుతుంది,” అని తేజస్వీ సూర్య చెప్పుకొచ్చారు.

బెంగళూరుతో పాటు అహ్మదాబాద్​లోనూ..!

మరోవైపు గురువారం యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్​లో పాల్గొన్న గార్సెట్టి మాట్లాడుతూ.. బెంగళూరులో కాన్సులేట్ లేని ఏకైక ప్రధాన దేశం అమెరికా అని, దీనిపై దృష్టి సారించామని పేర్కొన్నారు.

బెంగళూరుతో పాటు అహ్మదాబాద్​లో కాన్సులేట్లను తెరవనున్నట్లు అమెరికా గతంలో ప్రకటించింది. బెంగళూరులో కాన్సులేట్​ను ప్రారంభించడానికి తాము కట్టుబడి ఉన్నామని, త్వరలోనే ప్రకటన చేస్తామని గార్సెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.

బెంగళూరులో అమెరికాకు ఇప్పటికే ఫారిన్ కమర్షియల్ సర్వీస్ కార్యాలయం ఉందని, ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

2023లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా వెళ్లి అధ్యక్షుడు జో బైడెన్​ని కలిసినప్పుడు భారత్​​లో రెండు కొత్త యూఎస్ కాన్సులేట్లను ప్రకటించారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.