TG Fancy Numbers : కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు.. వీటికే ఎక్కువ డిమాండ్!-telangana transport department earns huge revenue through fancy numbers ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Fancy Numbers : కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు.. వీటికే ఎక్కువ డిమాండ్!

TG Fancy Numbers : కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు.. వీటికే ఎక్కువ డిమాండ్!

Basani Shiva Kumar HT Telugu
Dec 20, 2024 11:16 AM IST

TG Fancy Numbers : తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు వరంగా మారాయి. కోట్లాది రూపాయల ఆదాయాన్ని సమకూర్తుస్తున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిధిలో వీటికి డిమాండ్ ఉంది. 3, 6, 9 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.

కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు
కాసుల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు (istockphoto)

తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లు కోట్లాదీ రూపాయల ఆదాయాన్ని తీసుకొస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆదాయం రూ.100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో మొత్తం 56 రవాణా శాఖ కార్యాలయాలుండగా.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.

yearly horoscope entry point

రవాణా శాఖ ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.90 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. దాంట్లో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 3 జిల్లాల రవాణా శాఖ కార్యాలయాల్లో సుమారు రూ.74 కోట్ల ఆదాయం వచ్చింది. డబ్బున్నవారు ఎక్కువగా ఉండే ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయ పరిధిలో ఫ్యాన్సీ నంబర్లకు విపరీతంగా డిమాండ్‌ ఉంది.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం సిరీస్‌ నంబరు 09 కావటంతో.. ఇక్కడి ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్‌ అధికంగా ఉంది. 1, 9, 99, 999, 9999 దక్కించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది 9999 నంబరుకు వేలంలో ఓ వాహనదారుడు రూ.25.5 లక్షలు వెచ్చించారంటే.. ఫ్యాన్సీ నంబర్ల ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలం నిర్వహిస్తోంది. దీంట్లో పాల్గొనేందుకు వాహనదారుల నుంచి ఫీజు వసూలు చేస్తారు. అది రూ.5 నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. అయితే.. ఫీజు రూపంలో చెల్లించే డబ్బు కంటే.. వేలం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్‌లో ప్రత్యేక నంబర్ల కోసం 73 వేల 463 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు రూపంలో రూ.32.57 కోట్లు వస్తే.. వేలం ద్వారా రూ.40.99 కోట్ల ఆదాయం వచ్చింది.

తెలంగాణలో 0333, 0666, 0999, 0234, 1234, 0001, 0009, 0003, 0786 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే.. ఎక్కువమంది 9 నంబర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కారణంగానే ఖైరతాబాద్ కార్యాలయానికి ఎక్కువ ఆదాయం వస్తోందని చెబుతున్నారు. చాలామంది ప్రముఖులు ఇక్కడే నంబర్లు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

Whats_app_banner