OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత వచ్చిన సూపర్ హిట్ మలయాళం కామెడీ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
OTT Malayalam Comedy Movie: ఓటీటీలోకి ఏడాదిన్నర తర్వాత ఓ మలయాళం సూపర్ హిట్ కామెడీ మూవీ వచ్చింది. గతేడాది ఏప్రిల్లో రిలీజైన ఈ సినిమా మొత్తానికి ఇన్నాళ్లకు ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
OTT Malayalam Comedy Movie: మలయాళం మూవీ మదనోల్సవం (Madanolsavam) ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా గతేడాది ఏప్రిల్లో థియేటర్లలో రిలీజై మంచి హిట్ అందుకుంది. ఐఎండీబీలోనూ 7.1 రేటింగ్ ఉన్న ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు నటించాడు. ప్రజాస్వామ్యంపై సెటైరికల్ కామెడీగా ఈ మూవీని చిత్రీకరించారు. ఓటీటీ రిలీజ్ ఆలస్యం కాగా.. మొత్తానికి సుమారు 20 నెలల తర్వాత ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది.
మదనోల్సవం ఓటీటీ స్ట్రీమింగ్
మలయాళం మూవీ మదనోల్సవం ఏప్రిల్ 14, 2023లో రిలీజైంది. ఈ సినిమాను సుధీష్ గోపీనాథ్ డైరెక్ట్ చేయగా.. సూరజ్ వెంజరమూడు, బాబు ఆంటోనీ, రాజేష్ మాధవన్ లాంటి వాళ్లు నటించారు. ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 20) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో వచ్చిన సినిమా. రెండు రాజకీయాల పార్టీల మధ్య ఫైట్ లో ఓ సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడన్నదే మూవీ స్టోరీ.
ఇందులో మదనన్ మల్లక్కర అనే పాత్రలో సూరజ్, మదనన్ మంజక్కరన్ పాత్రలో బాబు ఆంటోనీ నటించారు. మదనన్ మల్లక్కర ఓ మామూలు వ్యక్తి. చిన్న చిన్న కోడి పిల్లలకు రంగులేసి అమ్ముతూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. మరో మదనన్ ఓ పెద్ద రాజకీయ నాయకుడు. ఎన్నికల్లో ఓ పార్టీ తరఫున అతడు పోటీ చేస్తుంటాడు. అయితే ఓటర్లను అయోమయానికి గురి చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ ఈ మదనన్ ను కూడా బరిలోకి దింపుతుంది.
అప్పటి వరకూ హాయిగా సాగిపోయిన అతని జీవితం ఈ రాజకీయాల వల్ల ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి అతని జీవితం ఏమైందన్నది ఈ మదనోల్సవం మూవీలో చూడొచ్చు. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను సరదాగా చూపించే ప్రయత్నం ఇందులో చేశారు. ఈ సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా మంచి రేటింగ్సే వచ్చాయి. ఐఎండీబీలో 7.1 రేటింగ్ నమోదైంది.
సెటైరికల్ కామెడీ మూవీ అయిన మదనోల్సవం చాలా రోజులుగా ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు. అయితే మొత్తానికి 20 నెలల తర్వాత ఇప్పుడు ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. కానీ కేవలం మలయాళం ఆడియోతోనే సినిమా అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూసే అలవాటు ఉంటే.. ఈ సెటైరికల్ కామెడీని ఎంజాయ్ చేయండి.