Virat Kohli: ఇండియాను వదిలేస్తున్న విరాట్ కోహ్లి.. భార్యాపిల్లలతో కలిసి లండన్‌కు షిఫ్ట్.. కన్ఫమ్ చేసిన కోచ్
Virat Kohli: విరాట్ కోహ్లి ఇండియాను వదిలేస్తున్నాడట. భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్ కు మకాం మారుస్తున్నాడట. ఈ విషయాన్ని అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ వెల్లడించాడు. ఇది కాస్త ఆశ్చర్యానికి గురి చేసే విషయమే.
Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి శాశ్వతంగా ఇండియాకు గుడ్ బై చెప్పనున్నాడు. తన భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్ లతో కలిసి లండన్ కు షిఫ్ట్ అవబోతున్నాడని అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ వెల్లడించాడు. ఈ మధ్యకాలంలో విరాట్ చాలా వరకు లండన్ లోనే కనిపించిన విషయం తెలిసిందే. అతని తనయుడు అకాయ్ కూడా అక్కడే జన్మించాడు.
ఇండియాను వదిలేస్తున్న విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి అంటే ఇండియా క్రికెటర్ అని మనం గొప్పగా చెప్పుకుంటాం. అయితే అది రిటైర్మెంట్ వరకు మాత్రమే అంటూ అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పడం గమనార్హం. విరాట్ త్వరలోనే శాశ్వతంగా లండన్ కు షిఫ్ట్ కానున్నట్లు అతడు వెల్లడించాడు. అందుకు రంగం సిద్ధం చేసుకునేందుకే ఈ ఏడాదిలో అతడు చాలా వరకు లండన్ లోనే కాలం వెళ్లదీసినట్లు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ ఏడాది మొదట్లోనే అతనికి అకాయ్ అనే కొడుకు లండన్ లోనే జన్మించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విరాట్, అనుష్కకు లండన్ లో ఓ ఇల్లు కూడా ఉంది.
"అవును. విరాట్ కోహ్లి తన భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్ కు షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాడు. త్వరలోనే ఇండియా వదిలి వెళ్లనున్నాడు. అయితే ప్రస్తుతానికైతే అతడు క్రికెట్ కాకుండా ఎక్కువ భాగంగా తన కుటుంబంతోనే గడుపుతున్నాడు" అని దైనిక్ జాగరన్ తో రాజ్ కుమార్ శర్మ చెప్పాడు.
లండన్‌లో అందుకేనా చక్కర్లు?
2024లో విరాట్ చాలా వరకు లండన్ లోనే కనిపించాడు. ఫిబ్రవరి 15న అతనికి కొడుకు పుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. జూన్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కోసం తిరిగి టీమిండియాతో చేరాడు. అది ముగియగానే మరోసారి యూకేకు వెళ్లాడు. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడినా అది ముగిసిన తర్వాత మళ్లీ లండన్ వెళ్లడం విశేషం. ఆగస్టు వరకు అతడు అక్కడే ఉన్నాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ కోసం ఇండియాకు వచ్చిన అతడు.. అప్పటి నుంచీ అక్కడే ఉన్నాడు.
ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం కోహ్లి ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే. అనుష్క, పిల్లలు కూడా అతనితోనే ఉన్నారు. నాలుగో టెస్టు కోసం మెల్‌బోర్న్ వెళ్లిన సందర్భంలో అక్కడి ఆస్ట్రేలియా జర్నలిస్టుతో కోహ్లి వీళ్ల విషయంలోనే గొడవకు దిగాడు. తన పిల్లలతో కలిసి ఉన్న సమయంలో తన అనుమతి లేకుండా వీడియోలు, ఫొటోలు ఎందుకు తీస్తున్నారంటూ వాళ్లను ప్రశ్నించాడు. అలాంటిదేమీ లేదని తేలడంతో విరాట్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కోహ్లి ఇప్పట్లో రిటైర్ అవడు: కోచ్
ఇక విరాట్ కోహ్లి ఇప్పట్లో రిటైరవడని కూడా కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపాడు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ కొనసాగే అవకాశం ఉన్నట్లు చెప్పాడు. "తన కెరీర్లో విరాట్ కోహ్లి బెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో సెంచరీ కూడా చేశాడు. తర్వాత రెండు మ్యాచ్ లలో మరో రెండు సెంచరీలు చేస్తాడని నమ్ముతున్నాను. తన గేమ్ ను ఎప్పుడూ ఎంజాయ్ చేసిన ప్లేయర్ అతడు. ఏ ప్లేయర్ అయినా తన గేమ్ ఎంజాయ్ చేస్తే తన బెస్ట్ ఇస్తాడు. విరాట్ ఫామ్ పై ఆందోళన లేదు" అని శర్మ అన్నాడు.
అశ్విన్ రిటైర్మెంట్ తో నెక్ట్స్ రోహిత్, విరాట్ రిటైరవుతారన్న వార్తలు వస్తున్నాయి. అయితే రాజ్ కుమార్ మాత్రం కోహ్లి ఇప్పట్లో రిటైరవడని కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. "విరాట్ ఇప్పటికీ చాలా ఫిట్ గా ఉన్నాడు. రిటైరయ్యే వయసు కాదు. మరో ఐదేళ్లు ఆడగలడు. 2027వరల్డ్ కప కూడా ఆడతాడు. విరాట్ తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అతన్ని 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ చూస్తున్నాను. అందుకే విరాట్ లో ఇప్పటికీ చాలా క్రికెట్ మిగిలి ఉందని చెప్పగలను" అని రాజ్ కుమార్ అన్నాడు.