Smriti Mandhana: 4, 4, 4, 4, 6, 4, 4.. రెచ్చిపోయిన స్మృతి మంధానా.. వెస్టిండీస్ వుమెన్ టీమ్‌పై ఇండియా వుమెన్ భారీ స్కోరు
Smriti Mandhana: స్మృతి మంధానా చెలరేగిపోయింది. వెస్టిండీస్ వుమెన్ టీమ్ తో జరుగుతున్న మూడో టీ20లో ఆమె వరుసగా ఏడు బౌండరీలు బాదడం విశేషం. ఆమెకు తోడు రిచా ఘోష్ కూడా మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్ లో ఇండియా వుమెన్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 217 రన్స్ చేసింది.
Smriti Mandhana: స్మృతి మంధానా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది. వెస్టిండీస్ వుమెన్ టీమ్ తో మూడో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ లేకపోవడంతో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆమె.. 47 బంతుల్లోనే 77 రన్స్ చేసింది. అయితే మధ్యలో ఆమె తాను వరుసగా ఆడిన ఏడు బంతులనూ బౌండరీలు, సిక్స్ గా మలచడం విశేషం. ఇక చివర్లో రిచా ఘోష్ కేవలం 21 బంతుల్లో 54 రన్స్ చేసింది. దీంతో ఇండియన్ వుమెన్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 217 రన్స్ చేసింది.
స్మృతి మంధానా.. 4, 4, 4, 4, 6, 4, 4
స్మృతి మంధానా ఓపెనర్ గా వచ్చింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో చినెలీ హెన్రీ వేసిన నాలుగు, ఐదు, ఆరు బంతుల్లో వరుసగా మూడు బౌండరీలు బాదింది. ఇక నాలుగో ఓవర్లో రెండు, మూడు, నాలుగు, ఐదు బంతుల్లో మరోసారి 4, 6, 4, 4 కొట్టడం విశేషం. దీంతో ఈ ఏడు బంతుల్లోనే ఆమె 30 పరుగులు చేసినట్లయింది. విండీస్ బౌలర్లపై విరుచుకుపడిన స్మృతి.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడింది.
ఈ సిరీస్ తొలి టీ20లో 49 పరుగులతో ఇండియా గెలవగా.. రెండో టీ20లో విండీస్ గెలిచింది. మూడో టీ20లో మాత్రం స్మృతి, రిచా చెలరేగడంతో ఇండియా భారీ స్కోరు చేయగలిగింది. చివరికి స్మృతి 47 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్ తో 77 రన్స్ చేసింది. అందులో 48 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.
చివర్లో చెలరేగిన రిచా
ఇక స్మృతి మంధానా తుఫాను వెలిసిందనుకుంటే.. చివర్లో వచ్చిన రిచా ఘోష్ సునామీలా విండీస్ బౌలర్లపై విరుచుకుపడింది. ఆమె కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. వచ్చీ రావడంతోనే బౌండరీల వర్షం కురిపించింది. చివరికి 5 సిక్స్ లు, 3 ఫోర్లతో 21 బంతుల్లోనే 54 రన్స్ చేసింది. ఇక రాఘవి బిస్త్ 22 బంతుల్లో 31, జెమీమా రోడ్రిగ్స్ 28 బంతుల్లో 39 రన్స్ చేశారు.
దీంతో ఇండియన్ వుమెన్స్ టీమ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 217 రన్స్ చేసింది. మన బ్యాటర్ల ధాటికి విండీస్ బౌలర్ డియాండ్రా డాటిన్ 4 ఓవర్లలోనే 54 రన్స్ ఇచ్చింది. మరో బౌలర్ కరిష్మా రంహారక్ 3 ఓవర్లలో 44, ఆలియా అలీన్ 4 ఓవర్లలో 45 రన్స్ ఇచ్చారు.