OTT: 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం.. అశ్లీల కంటెంట్ చూపిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం చర్యలు
OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ చూపిస్తున్నారంటూ ఏకంగా 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ను బ్లాక్ చేయడం గమనార్హం. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ పార్లమెంట్ లో వెల్లడించారు.
OTT: ఓటీటీ వచ్చిన తర్వాత బూతు కంటెంట్ నట్టింట్లోకి వచ్చింది. సెన్సార్ లేకపోవడంతో కొన్ని ప్లాట్‌ఫామ్స్ విచ్చలవిడిగా అశ్లీలమైన కంటెంట్ చూపిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ మితిమీరిన హింస, సెక్స్ సీన్లు సర్వసాధారణమైపోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా పూర్తి బూతు కంటెంట్ చూపిస్తున్న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై నిషేధం విధించింది. దీంతోపాటు పలు వెబ్ సైట్లను కూడా బ్లాక్ చేసినట్లు కేంద్ర సమాచార శాఖ సహాయమంత్రి ఎల్ మురుగన్ వెల్లడించారు.
18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం (డిసెంబర్ 18) శివసేన యూబీటీ సభ్యులు అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మార్చి 14న 18 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ను బ్లాక్ చేసినట్లు ఆయన చెప్పారు. ఇవి పూర్తి అశ్లీలమైన, అసభ్యకర కంటెంట్ ను చూపిస్తున్నాయంటూ మంత్రి చెప్పారు.
వీటిలో న్యూఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, బేషరమ్స్, మూడ్ ఎక్స్, ప్రైమ్ ప్లేలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వీటితోపాటు మరో 19 వెబ్ సైట్లు, 10 యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ల నుంచి తొలగించారు. ఇక డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టిక్ కండక్ట్ నిబంధనలకు లోబడి పని చేయాలని కూడా మంత్రి మురుగన్ స్పష్టం చేశారు.
సెన్సార్ లేని ఓటీటీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విప్లవం మొదలైన తర్వాత దేశంలో క్రమంగా టీవీ ఛానెల్స్ ను వదిలి వీటిని సబ్‌స్క్రైబ్ చేసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఓటీటీ కంటెంట్ కు సెన్సార్ లేకపోవడంతో విచ్చలవిడిగా అసభ్యకరమైన కంటెంట్ వచ్చేస్తోంది. ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా వరకు ఓటీటీ ఒరిజినల్ కంటెంట్ లో సెక్స్, హింస ఎక్కువగా ఉంటోంది. చాలా కాలంగా దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాలన్న డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.