Ishmart Jodi 3: మరింత ట్రెండీగా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3- అతిథులుగా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం టీమ్- ప్రేమకే పరీక్ష!
Ishmart Jodi Season 3 Streaming Date: యాంకర్ ఓంకార్ హోస్ట్‌గా చేస్తున్న రొమాంటిక్ రియాలిటీ గేమ్ షో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ప్రారంభం కానుంది. ఈ షోకి గెస్ట్‌లుగా ఒక ఎపిసోడ్‌లో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ నుంచి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, దిల్ రాజు రానున్నారు.
Ishmart Jodi Season 3 Telecast Date: ప్రేమ.. భాషతో పని లేని పదం.. మాట చెప్పలేని పదం.. కళ్లకు మాటలు నేర్పే పదం.. పెదాలతో ఓనమాలు దిద్దించే పదం.. ప్రేమ. అది ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్‌తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు సరికొత్తగా మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో
టెలివిజన్ ప్రయోక్తగా, షో నిర్వాహకుడిగా, సినిమా దర్శకుడిగా, వివిధ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రేక్షకుల్ని అలరించి, తనదైన ముద్ర వేసుకున్న ఓంకార్ "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని మరింత ట్రెండీగా, తరాలతో పాటు మారుతున్న అభిరుచుల్ని కూడా ఆకర్షించేలా అందించనున్నారు.
సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకి, అనురాగానికి కావాల్సినంత వినోదం కలిపి ఓ కొత్త ఫార్ములాతో రానుంది "ఇస్మార్ట్ జోడి సీజన్ 3". ఏదో ఒక ప్లాట్ ఫామ్‌లో ప్రేక్షకులకు దగ్గరలో ఉండే జంటలు ఇస్మార్ట్ జోడీ 3లో పాల్గొని డిఫరెంట్ లుక్ తీసుకురాబోతున్నారు.
ఇస్మార్ట్ జోడీ 3 జంటలు- అతిథులు
ప్రదీప్-సరస్వతి, అనిల్ జీలా-ఆమని, అలీ రెజా-మసుమా, రాకేష్-సుజాత, వరుణ్-సౌజన్య, యష్-సోనియా, మంజునాథ-లాస్య, బిగ్ బాస్ ఆదిరెడ్డి- కవిత, బిగ్ బాస్ అమర్ దీప్-తేజు ఈ సీజన్‌లో పాల్గొంటున్న జంటలు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు ఈ అందరూ షో ని హుందాగా పరిపూర్ణమైన కుటుంబ సభ్యులనే భావనను ప్రేక్షకులకు అందించనున్నారు.
అంతేకాకుండా ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోని ఒక ఎపిసోడ్‌కు విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం టీమ్ రానుంది. ఈ సినిమా నుంచి హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌తోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత అల్లు అరవింద్ అతిథులుగా విచ్చేయనున్నారు.
మరింత ప్రేమగా
ఈ షోలో అంతర్లీనంగా జంటలకు ఏం చెప్పగలం అనే విషయం కూడా ఆలోచించింది షో బృందం. ఈ షో వినోదంతో అలరించడమే కాదు. ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలు చేస్తుంది.
ప్రతి ప్రేమా గొప్పదే. నిజానికి గొప్పగా నిలబడితేనే అది ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమలో ఏది బెస్టో చెబుతుంది ఈ షో. అంతటితో ఆగిపోదు. ప్రతి ప్రేమలో నిజాయితీని, బలాబలాల్ని, వెలుగు నీడల్ని తెలుస్తుంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే ప్రతి జంటతో ఏదో ఒక విషయాన్ని చెబుతుంది "ఇస్మార్ట్ జోడి సీజన్ 3". అందుకే ఈ షో లో ప్రతి జంట ముఖ్యం. వాళ్లు పాల్గొనే ప్రతి రౌండ్ ముఖ్యం. ప్రతి ఆటా అంతే ముఖ్యం. ప్రతి పోటీ ముఖ్యం.
స్టార్ మాలో ప్రసారం
ప్రేమే పెద్ద పరీక్ష అయితే.. ఆ ప్రేమకే పరీక్ష అంటున్నారు హోస్ట్ ఓంకార్. ప్రేమ ఓ గమ్యమైతే.. ఆ ప్రయాణానికి పరీక్ష "ఇష్మార్ట్ జోడి సీజన్ 3". ప్రేమ ఒక తపస్సు అయితే.. ఆ ఏకాగ్రతకి పరీక్ష "ఇష్మార్ట్ జోడి సీజన్ 3". స్టార్ మాలో ఈ శనివారం (డిసెంబర్ 21) రాత్రి 9 గంటలకు "గ్రాండ్ లాంచ్ ఈవెంట్"తో ఈ షో ప్రారంభం కానుంది. అలాగే, ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ఈ షో ప్రసారం కానుంది.