TTD Calendar 2025 : ఆన్‌లైన్ ద్వారా భక్తులకు టీటీడీ డైరీలు, క్యాలెండర్లు.. ఇలా బుక్ చేసుకోండి
TTD Calendar 2025 : భక్తుల సౌకర్యార్థం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. ఎంపిక చేసిన ప్రాంతాలలో ఆఫ్‌లైన్‌లోనూ అందుబాటులో ఉండనున్నాయి. టీటీడీ వెబ్ సైట్ ద్వారా భక్తులు బుక్ చేసుకోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సంవత్సరానికి సంబంధించి 12 పేజీలు, 6 పేజీలు, టేబుల్, టాప్, క్యాలెండర్‌లు, డైరీలు, చిన్న డైరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి పెద్ద సైజు, శ్రీవారి, శ్రీపద్మావతి అమ్మవారు ఇరువురు ఉన్న కేలండర్లను టీటీడీ అందుబాటులో ఉంచింది.
ముఖ్యంగా ఎంపిక చేసిన ప్రాంతాలైన తిరుమల, తిరుపతి, తిరుచానూరులో ఉన్న టీటీడీ పబ్లికేషన్ స్టాల్స్‌తో పాటు.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, ముంబయి, వేలూరు, ఇతర ప్రధాన నగరాల్లోని కళ్యాణ మండపాల్లో 2025 సంవత్సరం క్యాలెండర్‌లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచింది.
టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారికి.. తపాలా శాఖ ద్వారా ఇంటికే పంపించే ఏర్పాట్లు చేసింది. టీటీడీ క్యాలెండర్‌లు, డైరీలు కావాల్సిన వారు www.tirumala.org, ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. నిర్ణయించిన ధరలకే విటిని విక్రయిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
లక్కీడిప్‌లో టికెట్లు..
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆర్జిత సేవాటికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు డిసెంబరు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే.. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
ఆర్జిత సేవా టికెట్లు..
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను డిసెంబరు 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవల కోటా..
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన 2025 మార్చి నెల కోటాను డిసెంబరు 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు..
మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను డిసెంబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
శ్రీవాణి టికెట్ల..
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మార్చి నెల ఆన్ లైన్ కోటాను డిసెంబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.