Hyderabad Formula E Race Case : ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు - ఏ1గా కేటీఆర్!-acb registers case on hyderabad formula e car race scam kt rama rao named as a 1 in this case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Formula E Race Case : ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు - ఏ1గా కేటీఆర్!

Hyderabad Formula E Race Case : ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు - ఏ1గా కేటీఆర్!

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 19, 2024 05:07 PM IST

Hyderabad Formula E Race Case Updates : ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ పేర్లను నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి ఉన్నారు.

కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు
కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు

ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి… ఏసీబీకి లేఖ రాశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ… కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్ పేరును చేర్చింది.

ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంలో ఏ1గా మాజీ మంత్రి కేటీఆర్ పేరు ఉంది. ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి ఉన్నారు.

అవినిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2)తో పాటు ఐపీసీ 409,120(B) సెక్షన్ల కింద నమోదు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేయటంతో… కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా HMDA నిధుల నుంచి రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేశారనే ఆరోపణలను అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫార్ములా ఈరేసింగ్ - ఏం జరిగిందంటే…?

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూాడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.

రెండోసారి ఈవెంట్ జరగాల్సి ఉండగా.. అప్పటికే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎఫ్‌ఈవోకు చెల్లించిన రూ. 55 కోట్లపై విచారణకు ఆదేశించింది.

ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఈ డబ్బులను చెల్లించారని సర్కార్ గుర్తించింది. విదేశీసంస్థకు నిధుల బదిలీ ప్రక్రియలో కూడా ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా వ్యవహారించినట్లు ప్రాథమికంగా గుర్తించటంతో ఈ మొత్తం వ్యవహారపై దర్యాప్తునకు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులోని అధికారుల పాత్రపై దర్యాప్తునకు అనుమతి రాగా… అప్పటి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై విచారణ జరపాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా గవర్నర్ అనుమతి కోరగా.. ఇటీవలే అనుమతి వచ్చింది.

గవర్నర్ నుంచి అనుమతి రావటంతో ఈరేసు వ్యవహారంపై విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలనే ఏసీబీకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి లేఖను కూడా ఇందుకు జత చేశారు. ప్రభుత్వం నుంచి లేఖ అందటంతో ఏసీబీ కేసు నమోదు చేసింది.

విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఏసీబీ విచారణలో పూర్తిస్థాయిలో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రాథమిక విచారణలో లభించే ఆధారాల తర్వాత ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో కేటీఆర్ తో పాటు అప్పటి అధికారులను విచారించే అవకాశం స్పష్టంగా ఉంది.

అసెంబ్లీలో స్పందించిన కేటీఆర్

ఏసీబీ కేసు నమోదుపై కేటీఆర్ స్పందించారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫార్ములా-ఈ రేస్ మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. దాని మీద మొత్తం సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం