Ind vs Pak: వచ్చే మూడేళ్ల పాటు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లోనే.. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ పద్ధతిలోనే
Ind vs Pak: ఇండియా, పాకిస్థాన్ మధ్య వచ్చే మూడేళ్ల పాటు జరిగే క్రికెట్ మ్యాచ్ లన్నీ తటస్థ వేదికల్లోనూ జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ గురువారం (డిసెంబర్ 19) ఈ ప్రతిపాదనను ఆమోదించింది. వచ్చే ఏడాది పాకిస్థాన్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించనున్నారు.
Ind vs Pak: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై వివాదానికి తెరపడింది. ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. గురువారం (డిసెంబర్ 19) ఈ మేరకు అధికారిక ప్రకటన జారీ చేసింది. దీంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ తోపాటు ఇండియా ఆడే అన్ని మ్యాచ్ లు తటస్థ వేదికలోనే జరుగుతాయి.
అంతేకాదు వచ్చే మూడేళ్ల పాటు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వబోయే ఐసీసీ టోర్నీల్లో ఇండియా మ్యాచ్ లు, ఇండియా ఆథిత్యమివ్వబోయే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్ లు తటస్థ వేదికల్లోనే జరగనున్నాయి.
హైబ్రిడ్ పద్ధతిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ తోపాటు తటస్థ వేదికలోనూ జరగనుంది. ఈ హైబ్రిడ్ విదానాన్ని గురువారం (డిసెంబర్ 19) ఐసీసీ ఆమోదించింది. ప్రతిగా ఇండియా నిర్వహించబోయే అన్ని ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ మ్యాచ్ లు కూడా తటస్థ వేదికలోనే జరుగుతాయి. 2024-27 మధ్య ఇండియా, పాకిస్థాన్ లలో జరగబోయే అన్ని ఐసీసీ టోర్నీలకు ఇది వర్తిస్తుంది. 2025 ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీతోనే ఈ కొత్త ఒప్పందం అమల్లోకి వస్తుంది.
ఆ తర్వాత ఇండియాలో జరగనున్న 2025 వుమెన్స్ వన్డే వరల్డ్ కప్, 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ లకు కూడా ఇదే వర్తిస్తుంది. 2026 టీ20 వరల్డ్ కప్ కు ఇండియాతోపాటు శ్రీలంక కూడా ఆతిథ్య దేశంగా ఉండటంతో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఆ దేశంలో జరుగుతుంది. దీనికి అంగీకరించినందుకుగాను పాకిస్థాన్ కు 2028లో జరగబోయే వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కట్టబెట్టారు. తటస్థ వేదిక ఏది అనేది ఆతిథ్య దేశం నిర్ణయిస్తుంది. దీనిని ఐసీసీ ఆమోదించాల్సి ఉంటుంది. ఇప్పుడు 24 గంటల్లోనే పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తటస్థ వేదిక ఏదో నిర్ణయించాలి. యూఏఈకే ఎక్కువ అవకాశాలు ఉండగా.. శ్రీలంకకు కూడా అవకాశం ఉంది.
ట్రయాంగులర్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్
తాజాగా ఐసీసీ సమావేశంలో ఇండియా, పాకిస్థాన్ లతో కూడిన ట్రయాంగిల్ లేదా క్వాడ్రాంగులర్ సిరీస్ నిర్వహణపైనా చర్చించారు. చర్చల్లో భాగంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ టోర్నమెంట్ కు తాము అభ్యంతరం చెప్పబోమని, అయితే తటస్థ వేదిక నిబంధన ఐసీసీ టోర్నీల్లాగే దీనికీ వర్తిస్తుందని మాత్రం ఐసీసీ స్పష్టం చేసింది. ఇలాంటి టోర్నీ నిర్వహణ మొత్తం బీసీసీఐ, పీసీబీ మధ్యే ఉంటుందని తెలిపింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో రెండు నెలలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందంతో అన్ని క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో కొన్నాళ్లుగా పీసీబీ, బీసీసీఐ మధ్య మాటల యుద్ధం నడిచిన విషయం తెలిసిందే. ఒకవేళ పాకిస్థాన్ కు ఇండియా రాకపోతే.. తాము కూడా 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్ ను బాయ్‌కాట్ చేస్తామని కూడా పీసీబీ హెచ్చరించింది. మొత్తానికి ఈ వివాదానికి ఇక్కడితో తెరపడింది.