Team India: అశ్విన్ బాటలోనే మరో ఐదుగురు క్రికెటర్లు - ఇంగ్లండ్ టూర్‌లోపే రిటైర్‌మెంట్ ప్రకటిస్తారా?
Team India: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో నే ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా స్పిన్ దిగ్గజ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించడం క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. అశ్విన్ బాటలోనే మరో ఐదుగురు సీనియర్ క్రికెటర్లు రిటైర్‌మెంట్ ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులను షాకింగ్‌కు గురిచేసింది. గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసిన వెంటనే అశ్విన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై అది టెస్ట్ సిరీస్ మధ్యలోనే కెరీర్‌కు అశ్విన్ గుడ్‌బై చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అశ్విన్‌ను జట్టులో నుంచి తప్పించి రిటైర్‌మెంట్ ప్రకటించేలా టీమ్ మేనేజ్‌మెంట్ చేసిందని క్రికెట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
అశ్విన్ రిటైర్‌మెంట్ వెనుక కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మరికొందరు ప్రమేయం ఉందని చెబుతోన్నారు. పేలవ ఫామ్ కారణంగానే అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడని, గౌరవప్రదంగానే జట్టును వీడి మంచి పని చేశాడని మరికొందరు మాజీ క్రికెటర్లు చెబుతోన్నారు.
మరో ఐదుగురు క్రికెటర్లు...
ఏది ఏమైనా అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రభావం మరికొందరు సీనియర్లపై గట్టిగానే పడ్డట్లు సమాచారం. అశ్విన్ బాటలోనే విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పూజారా, అజింక్య రహానేతో పాటు రవీంద్ర జడేజా కూడా తొందరలోనే రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనుంది.
ఆ లోపే ఈ ఐదుగురు సీనియర్ క్రికెటర్ల భవిష్యత్తుపై ఓ క్లారిటీ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. పేలవ ఫామ్‌ను దృష్టిలో పెట్టుకొని రోహిత్, కోహ్లి కెరీర్‌పై బీసీసీఐ ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సేమ్ సీన్ రిపీట్
గతంలో వన్డే వరల్డ్ కప్ తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, లక్ష్మణ్‌తో పాటు ఒక్కొక్కరు సీనియర్ ప్లేయర్లు జట్టును వీడారు. సేమ్ సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే తొలుత అశ్విన్ జట్టును వీడినట్లు చెబుతోన్నారు. మిగిలిన సీనియర్లు కూడా ఎప్పుడైనా రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
భారీగా మార్పులు...
ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికచేసే ఇండియన్ టీమ్‌లో భారీగానే మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. కంప్లీట్‌గా యంగ్ టీమ్‌ను సెలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. సీనియర్లు జట్టులో కనిపించే అవకాశాలు తక్కువేనని చెబుతోన్నారు. రిటైర్‌మెంట్‌కు సంబంధించి సీనియర్లకు టీమ్ మేనేజ్‌మెంట్‌తో పాటు బీసీసీఐ వర్గాలు డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తునే ఉందని, అశ్విన్ గుడ్‌బై నిర్ణయం అందులో భాగమేనని చెబుతోన్నారు.
వాషింగ్టన్ సుందర్ పోటీ...
అశ్విన్ సడెన్ రిటైర్‌మెంట్ చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. కానీ ఈ రిటైర్‌మెంట్ నిర్ణయం మాత్రం హఠాత్తుగా తీసుకున్నది కాదని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన స్థానం దక్కకపోతే వెంటనే రిటైర్‌మెంట్ ప్రకటించాలని అశ్విన్ అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతోన్నారు. ఈ టోర్నీలో చోటు దక్కిన మూడు టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
ఇన్నాళ్లు టెస్టుల్లో అశ్విన్, జడేజా ద్వయం తిరుగులేకుండా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరికి పోటీగా వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ లాంటి యంగ్ ప్లేయర్లు దూసుకురావడంతోనే వీరిద్దరి ప్లేస్‌లకు గండిపడింది.