Dummy Pistol Robbery: బొమ్మ తుపాకీతో బెదిరించి కాకినాడలో బంగారం దోపిడీ.. చివరకు ఏమైందంటే…
Dummy Pistol Robbery: బంగారు ఆభరణాల షోరూమ్‌లో నగలు కొంటున్నట్టు నటిస్తూ ఉన్నట్టుండి బొమ్మ తుపాకీతో సేల్స్ బాయ్‌ను బెదిరించి పరారైన ఘటన కాకినాడలో బుధవారం రాత్రి జరిగింది. చేతికి అందిన ఆభరణాలతో ఊడాయించిన నిందితుడు కొద్ది దూరంలోనే కానిస్టేబుల్‌కు దొరికిపోయాడు.
Dummy Pistol Robbery: సినీ ఫక్కీలో నగల దుకాణంలో సేల్స్‌మాన్‌కు తుపాకీ చూపించి ఆభరణాలతో ఉడాయించిన ఘటన కాకినాడలో బుధవారం జరిగింది. బొమ్మ తుపాకీతో సేల్స్‌బాయ్‌ను బెదిరించి చేతికి అందిన బంగారు ఆభరణాలతో పరుగు లంకించుకున్నాడు. కానీ ఎక్కువ దూరం వెళ్లకుండానే పోలీసులకు దొరికిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన కాకినాడలో కలకలం రేపింది.
కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన 26 ఏళ్ల నూకల సతీష్ వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు. జులాయిగా తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. బుధవారం కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న తనిష్క్ జ్యూయలరీ షోరూమ్‌కు వెళ్లాడు.
బంగారం గొలుసులు కావాలని అడగడంతో సేల్స్‌మాన్ వాటిని చూపిస్తున్నాడు. టేబుల్‌పై పలు రకాల గొలుసుల్ని పేర్చడంతో జేబులో తెచ్చుకున్న బొమ్మ తుపాకీని అతనికి పాయింట్ బ్లాంక్‌లో గురి పెట్టాడు. ఖంగుతిన్న సేల్స్‌మాన్ బిత్తరపోయి చూస్తుండగా చేతికి అందిన గొలుసులతో ఉడాయించాడు.
బంగారు గొలుసులతో పారిపోతుండగా తేరుకున్న సేల్స్‌మాన్ అతని వెనుక కేకలు వేస్తూ పరుగులు తీశాడు. నిందితుడిని వెంబడించిన ట్రాఫిక్ పోలీసులు కొద్ది దూరంలోనే నిందితుడి పట్టుకున్నారు. అతని జేబులో ఉన్న ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 39గ్రాముల విలువైన గొలుసుల్ని అపహరించినట్టు గుర్తించారు. చోరీకి గురైన బంగారాన్ని జ్యూయలరీ షాపు యాజమాన్యానికి అప్పగించారు. నిందితుడు డమ్మీ పిస్టల్‌తో బెదిరించినట్టు గుర్తించారు. కాకినాడ వన్‌టౌన్ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.