Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాల‌యాల్లో నిద్ర అంటే నరకమే…-dying in vijayawada is more difficult for relatives than death sleeping in temples is hell ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాల‌యాల్లో నిద్ర అంటే నరకమే…

Vijayawada Struggles: విజయవాడలో చావంటే, బంధువులకు చావుకు మించిన కష్టం.. దేవాల‌యాల్లో నిద్ర అంటే నరకమే…

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 19, 2024 09:28 AM IST

Vijayawada Struggles: విజయవాడలో ఎవరైనా మరణిస్తే వారి బంధువులకు కూడా చచ్చేంత కష్టాలు తప్పడం లేదు. మరణించిన వారి కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించడం కూడా కష్టమైపోతోంది. దేవాదాయ శాఖ తీరుతో కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత ఆలయాల్లో నిద్రించే ఆనవాయితీని పాటించడం కూడా సవాలుగా మారుతోంది.

సీతానగరంలోని ఆలయాలు
సీతానగరంలోని ఆలయాలు

Vijayawada Struggles: విజయవాడలో చావంటే.. చావుకు మించిన కష్టం

హిందూ సాంప్ర‌దాయం ఆచ‌రించే వారికి దేవుడు క‌నిపిస్తాడు

ఒక‌రి ఇంట్లో చావు.. మ‌రొక‌రికి పండ‌గ అంటే న‌మ్మ‌గ‌ల‌మా.. కానీ.. న‌మ్మి తీరాలి త‌ప్ప‌దు. సాధార‌ణంగా హిందూ సాంప్ర‌దాయాల‌ను అనుస‌రించి జీవించేవారి ఇళ్ళలో ఎవరైనా మరణిస్తే హిందూ పురాణాల‌ను అనుస‌రించి నిర్వ‌హిస్తున్న శ్రాద్ధ‌క‌ర్మ‌ల్లో దేవాయాల‌ ప్రాంగ‌ణంలో నిద్రించ‌డం కూడా ఒక భాగం. అలా నిద్రిస్తే మ‌ర‌ణించిన వారి ఆత్మ‌లు స్వ‌ర్గానికి చేరుకుంటాయ‌ని విశ్వసిస్తారు. 

 ప్ర‌స్తుతం విజ‌య‌వాడ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారివారి బంధువులు ప్ర‌కాశం బ్యారేజీ ఆవ‌ల వైపున ఉన్న ఒక దేవాల‌య ప్రాంగ‌ణంలో నిద్రించేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తి చూపుతారు. ఈ ఆస‌క్తి అ ఆల‌య ప్రాంగ‌ణంలోని స‌త్రాల నిర్వాహ‌కుల‌కు కాసులు కురిపిస్తుంది. కొంత‌మంది ఒంట‌రిగా వెళ్ల‌లేక నిద్రించేందుకు ఇద్ద‌రిముగ్గురుని క‌లుపుకుని వెళుతుంటారు. అక్కడ స్టార్‌ హోట‌ళ్ళ‌లో సైతం లేని రుసుముల‌తో ..నిర్వాహ‌కులు హిందూ మ‌త విశ్వాసాల‌ను ఆచ‌రిస్తున్న వారి నుంచి వేల రూపాయ‌లు దండుకుంటున్నారు.

విజయవాడలో ఎవరైనా మరణిస్తే కర్మకాండలు పూర్తి చేసిన తర్వాత రక్తసంబంధీకులు ఆలయాల్లో నిద్రించడం పెద్ద సమస్యగా మారింది. విజయవాడ నగరంలో ఎవరైనా మరణిస్తే పెద్ద కర్మ పూర్తైన తర్వాత వారి బంధువులు కృష్ణానదిని దాటి గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున  సీతానగరంలో ఉండే శివాలయంలో నిద్రించడం ఆనవాయితీగా వస్తోంది. 11వ రోజు కర్మకాండలు పూర్తైన తర్వాత ఏరు దాటి ఆలయంలో నిద్రచేసే ఆచారం విజయవాడ వాసులకు ఎప్పటి నుంచో ఆచారంగా వస్తోంది.

ఇంద్రకీలాద్రికి అభిముఖంగా కృష్ణానదికి గుంటూరు జిల్లా తాడేపల్లి వైపు ఉన్న కొండపై ఉన్న అభయాంజనేయస్వామి, రాజరాజేశ్వరి ఆలయం, శివాలయాల్లో నిద్రచేసి ఉదయాన్నే నదీ స్నానం చేసి ఇళ్లకు తిరిగి వస్తారు. కొన్నేళ్ల క్రితం వరకు ఈ ఆచారం పాటించడంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టు పక్కల నిద్ర చేసి ఉదయాన్నే నదిలో స్నానాలు చేసి దైవ దర్శనాలు చేసుకుని ఇళ్లకు తిరిగి వెళ్లేవారు.

రాష్ట్ర విభజన తర్వాత తాడేపల్లిలో ఉన్నఅభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని నిర్మించింది. అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, శివాలయాల్లో నిద్రలు చేసే ఆచారాలను పూర్తిగా విస్మరించారు. దీంతో భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు.

సీతానగరంలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ప్రజలు నిద్ర చేయడానికి అరకొరగా ఏర్పాట్లు ఉండటంతో విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది ఈ ఆలయాల్లో రాత్రి పూట బస చేయడానికి వస్తుంటారు. సరైన సదుపాయాలు లేకపోవడంతో భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు. దీనికి తోడు ఆలయ సిబ్బంది, దళారులు అందిన కాడికి వచ్చిన వారిని దోచుకుంటున్నారు.

ప్రైవేట్‌ వ్యాపారులదే హవా...

సీతానగరంలో రాత్రి నిద్రకు వెళ్లే వారిని ప్రైవేట్ వ్యాపారులు దోచుకుంటున్నారు. కుటుంబాలతో వచ్చే వారికి గదులు అద్దెకు ఇచ్చి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. మహిళలు, వృద్ధులతో వచ్చే వారు ప్రైవేట్‌ గదులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆలయ ప్రాంగణంలో ప్రజల కోసం దేవాదాయ శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడంతో అడిగినంత చెల్లించాల్సి వస్తుందనే ఆరోపణలు ఉన్నాయి.

 హిందూ మత విశ్వాసాలతో ముడిపడి ఉన్న సమస్య విషయంలో ఫిర్యాదులు వస్తున్నా దేవాదాయ శాఖ మాత్రం స్పందించడం లేదు. ఆలయంలో నిద్రించడానికి వచ్చే వారికి కనీస సదుపాయాలు కూడా కల్పించడంలో విఫలమవుతోంది.

సీతానగరం ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఘాట్లలో కూడా గతంలో భక్తులు నిద్రలు చేసేవారు.కొన్నేళ్లుగా రాత్రి సమయంలో అసాంఘిక శక్తులు తిష్ట వేయడంతో భక్తులు ఆలయాల్లోనే నిద్రిస్తున్నారు. ఆలయాల్లో నిద్ర చేయడానికి తగిన సదుపాయాలు లేకపోవడం, దళారుల నిలువు దోపిడీ సంగతి తెలిసినా దేవాదాయ శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం విమర్శలకు దారి తీస్తోంది.

Whats_app_banner