Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!-cherlapally railway terminal to be inaugurated on december 28 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cherlapally Railway Station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!

Cherlapally Railway station : ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!

Basani Shiva Kumar HT Telugu
Dec 19, 2024 10:03 AM IST

Cherlapally Railway station : ఎట్టకేలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈనెల 28న దీన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి ఈ స్టేషన్ ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం
ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.

ఇవీ ప్రత్యేకతలు..

ఇక్కడ ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్‌ ఏసీ హాల్స్, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు ఎంఎంటీఎస్‌ ప్లాట్‌ఫాంలతో కలిపి 9 ప్లాట్‌ఫాంలు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు.

రైళ్ల వివరాలు..

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చర్లపల్లి 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, పుష్‌-పుల్‌, శబరి ఎక్స్‌ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్‌, ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.

భారం తగ్గుతుంది..

చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. అయితే.. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభం అయిన తర్వాత స్టేషన్‌కు చేరుకునే మార్గంలో.. రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజారవాణాను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే.. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.

చర్లపల్లి రైల్వే స్టేషన్ పనులు పూర్తైన నేపథ్యంలో రైల్వే బోర్డు పలు అనుమతులు ఇచ్చిందని తెలుస్తోంది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు అనుమతి వచ్చిందని సమాచారం.

మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షాలిమార్‌ - హైదరాబాద్‌ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, గోరఖ్‌పూర్‌ - సికింద్రాబాద్‌ - గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌‌లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది.

Whats_app_banner