US Fed Rate : యూఎస్ ఫెడ్ కీలక ప్రకటన.. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లు తగ్గింపు!
US Fed Policy Meet : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించింది.
యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ పాలసీ సమావేశంలో వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇప్పుడు వడ్డీ రేటు 4.2 నుంచి 4.50 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు సెప్టెంబర్ 2024లో 50 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగింది.
వడ్డీరేట్ల తగ్గింపు తర్వాత అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించింది. వడ్డీ రేట్ల తగ్గింపు తనఖా, ఆటో లోన్‌తో సహా క్రెడిట్ కార్డ్‌లపై రుణ వడ్డీని తగ్గించే అవకాశం ఉన్నందున వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.
అమెరికాలో ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్‌లో 2.3శాతానికి క్షీణించింది. ఇది 2022లో అత్యధికంగా ఉన్న 7.2 శాతం కంటే చాలా తక్కువ. ఇది నాలుగు దశాబ్దాలలో అత్యధికం. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా పెరిగాయి. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నందున అధిక రేట్లను కొనసాగించాల్సిన అవసరం లేదని చాలా మంది ఫెడ్ అధికారులు భావిస్తున్నారు.
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత ఆర్బీఐ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే డిసెంబర్ ప్రారంభం వరకు వరుసగా పదకొండు సార్లు ఆర్బీఐ రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించింది. అయితే డిసెంబర్, జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గితే ఫిబ్రవరిలో వడ్డీరేట్లలో కోత పెట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 2 శాతం చొప్పున సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం, ఉపాధి లక్ష్యాలను సాధించడంలో ఫెడ్ బ్యాలెన్స్డ్ మూవ్ కలిగి ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలం కిందట సెంట్రల్ బ్యాంక్ చైర్ జెరోమ్ పావెల్ అమెరికా ఎకానమీ బలంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. దీనికి అనుగుణంగా ప్రస్తుత వడ్డీ రేట్లు తగ్గింపు కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.
మరోవైపు భారత స్టాక్ మార్కెట్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో క్షీణత కొనసాగుతోంది. సోమవారం నుండి సెన్సెక్స్ సుమారు భారీ పాయింట్లు పడిపోయింది. యూఎస్ ఫెడ్ పాలసీ ప్రకటనకు ముందు భారీ పెరుగుదల తర్వాత లాభాల బుకింగ్ కారణంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారు.