Electric Scooters : డిసెంబర్ ఫస్ట్ హాఫ్‌లో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నెంబర్ 1.. తర్వాత టీవీఎస్, ఓలా!
Electric Scooters : ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. డిసెంబర్ అమ్మకాలు చూస్తే బజాజ్ చేతక్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత పొజిషన్‌లోకి టీవీఎస్ ఐక్యూ్బ్ వచ్చింది.
భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి ఓలా ఎలక్ట్రిక్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ మధ్య పోటీ ఉంది. ఈ డిసెంబర్ నెలలో మూడు కంపెనీలు గరిష్టంగా ఈ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. బజాజ్ చేతక్ అన్ని కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాహన్ వెబ్‌సైట్ ప్రకారం.. డిసెంబర్ 1 నుండి 14 మధ్య కాలంలో బజాజ్ చేతక్ దాదాపు 9,513 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.
టీవీఎస్ ఐక్యూబ్ 7,567 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలతో రెండో స్థానంలో ఉంది. ఇన్ని ఏళ్లుగా మెుదటి స్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ 6,387 యూనిట్ల ఎస్1 సిరీస్ ఈ స్కూటర్ల విక్రయాలతో మూడో స్థానంలో ఉంది. ఏథర్ ఎనర్జీ 5,053 యూనిట్లతో 4వ స్థానంలో కొనసాగుతోంది. ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తున్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ 1,378 యూనిట్లతో ఐదో స్థానంలో ఉంది.
ఇక బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికొస్తే.. ఇది వివిధ రూపాల్లో దొరుకుతుంది. ఎక్స్ షోరూమ్ ధరతో కలిపి రూ.95,000 నుండి రూ.1.56 లక్షల వరకు ఉంటుంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 123 నుండి 136 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
టీవీఎస్ ఈవీ రూ. 1.07 లక్షల నుండి రూ. 1.37 లక్షల వరకు ఎక్స్ షోరూమ్‌గా ఉంది. ఇది 2.2 KWh, 3.04 KWh, 5.1 KWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జింగ్‌తో 75 నుండి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఓలా ఎలక్ట్రిక్ విక్రయించే ఎస్1 సిరీస్ ఇ-స్కూటర్‌లు వివిధ రకాలైన వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంటాయి. దీని ధర రూ. 74,999 నుండి రూ. 1.14 లక్షల ఎక్స్-షోరూమ్. 2 KWh, 3 KWh, 4 KWh బ్యాటరీలను కలిగి ఉంటుంది. దీని రేంజ్ ఒక్కసారి ఛార్జ్‌పై 95 నుండి 193 కి.మీ వరకు ఉంటుంది.
మెుత్తానికి డిసెంబర్ 1 నుండి 14 వరకు అమ్మకాల నివేదిక. దాని ప్రకారం బజాజ్ చేతక్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. టీవీఎస్ ఐక్యూబ్ రెండో స్థానంలో, ఓలా ఎస్1 సిరీస్ మూడో ప్లేస్‌లో ఉంది. డిసెంబర్ పూర్తయ్యేసరికి ఏది టాప్‌లోకి వెళ్తుందో చూడాలి.