Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి-karimnagar roads bridges development bandi sanjay request crif letter ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

Karimnagar Roads : కరీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

HT Telugu Desk HT Telugu
Dec 18, 2024 10:09 PM IST

Karimnagar Roads : కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు రవాణా సదుపాయాల కోసం రూ.224 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు బండి సంజయ్. దిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించారు.

రీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి
రీంనగర్ రవాణా సదుపాయాలకు రూ.224 కోట్ల నిధులు, కేంద్రమంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి

Karimnagar Roads : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాలకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు రూ.224 కోట్ల మేరకు సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (CRIF) నిధులు మంజూరు చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దిల్లీలో వినతి పత్రం అందజేశారు.

కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్లు, వంతెనల అభివృద్ధికి సంబంధించి పలు అంశంపై నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్ళారు బండి సంజయ్. ముఖ్యంగా సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ రోడ్ల విస్తరణ పనులకు సంబంధించిన ప్రతిపాదనను ఆయన ముందుంచారు. ప్రధానంగా కేశవపట్నం నుండి పాపయ్యపల్లె మీదుగా సైదాపూర్ వరకు 15 కి.మీల మేరకు సింగిల్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని, కొడిమ్యాల నుండి గోవిందారం మీదుగా తాండ్రియాల వరకు 30 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని కోరారు. అట్లాగే చొప్పదండి మండలం అర్నకొండ నుండి గోపాల్ రావు పేట మీదుగా మల్యాల చౌరస్తా వరకు 45 కి.మీల మేరకు, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ నుండి సింగారం మీదుగా ముస్తాబాద్ మండలం రాంరెడ్డి పల్లె వరకు 15 కి.మీల మేరకు సింగిల్ లేన్ రోడ్డును డబుల్ లేన్ గా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.

మానేర్ పై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి

కరీంనగర్ జిల్లాలోని గుండ్లపల్లి పోతూరు రోడ్ (కి.మీ 18/0- 2), బావూపేట ఖాజీపూర్ ( కి.మీ2/0-2) వరకు మానేరు నదిపై హైలెవెల్ బ్రిడ్జిని నిర్మించాలని కోరారు. హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం సహా మొత్తం 90 కి.మీల మేరకు రోడ్డు విస్తరణ పనులకుగాను రూ.224 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని బండి సంజయ్ కు హామీ ఇచ్చారు. దీంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే సీఆర్ఐఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపైనా గడ్కరీ ఆరా తీశారు.

ప్రతి పల్లెకు రవాణా సౌకర్యం

కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికి పల్లెకు రోడ్డు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. మెరుగైన రవాణా సౌకర్యమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner