Karimnagar Crime: అంతరాష్ట్ర గజ దొంగను అరెస్టు చేసిన కరీంనగర్ పోలీసులు… బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
Karimnagar Crime: కరీంనగర్ లో దొంగలు రెచ్చిపోయారు... తాళాలు వెసి ఉన్న ఇంటితో పాటు ఆలయంలో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు నిఘా పెట్టగా అంతరాష్ట్ర గజదొంగ పట్టుబడ్డాడు. 20కిపైగా కేసుల్లో నిందితుడని పోలీసులు తేల్చారు.
Karimnagar Crime: కరీంనగర్‌లో గజ దొంగ పట్టుబడ్డాడు. ఇటీవల నగరంలో 15రోజుల్లో పలు చోట్ల చోరీలు జరిగాయి. కోతిరాంపూర్ బస్టాప్ వద్ద గల హనుమాన్ ఆలయంలో చొరబడ్డ దొంగలు పంచలోహా విగ్రహాలను అపహరించారు. మరుసటి రోజే లక్ష్మినగర్ హనుమాన్ టెంపుల్ లో చోరీకి యత్నించగా వాచ్ మెన్ రాకతో దొంగ పారిపోయాడు. అంతకు ముందు 23న కట్టరాంపూర్ శాతవాహనకాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడిన దొంగలు టీవీతో పాటు బీరువాలోని 20 గ్రాముల బంగారు ఆభరణాలు , 46 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
వరుస చోరీలతో అప్రమత్తమైన పోలీసులు కరీంనగర్ వన్ టౌన్ సిఐ బిల్లా కోటేశ్వర్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిఘా పెట్టగా అంతరాష్ట్ర గజ దొంగ ఏపిలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు (50) పట్టుబడ్డారు. అతని నుంచి 16 గ్రాముల బంగారు గొలుసు, 4 గ్రాముల ఉంగరం, సాంసంగ్ ఎల్ఈడి టివి తో పాటు 46 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ కోటేశ్వర్ తెలిపారు.
నిందితుడిపై 20కి పైగా కేసులు..
చోరీలతో పోలీసులకు కంటీమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ సత్తిబాబు పాత నేరస్థుడేనని పోలీసులు తేల్చారు. గౌతమి నగర్లో వాహనాల తనిఖీ చేపట్టగా పట్టుబడ్డ గజదొంగ సత్తిబాబుపై 20 కి పైగా కేసులు ఉన్నట్లు సిఐ ప్రకటించారు. చోరీ చేయడంలో ఆరితేరి సత్తిబాబు ఇప్పటికే పలుమార్లు జైల్ కు వెళ్లాడని... జైల్ నుంచి బెయిల్ పై బయటికి రాగానే మళ్లీ చోరీలకు పోల్పడుతున్నాడని తెలిపారు. అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడంతోపాటు మరోసారి చోరీలకు పాల్పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
ఏపీలో పుట్టి తెలంగాణ లో చోరీ...
ఏపీలో పుట్టిన సత్తిబాబు తెలంగాణలో పలు చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్ళే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నాడని పోలీసులు నిర్ధారించారు. అయితే ఆలయంలో చోరీకి పాల్పడ్డ దొంగ మాత్రం దొరకలేదు. చిల్లర దొంగలే ఈ చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తాళం వేసి బయటికి వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)