Balagam Mogilaiah : తెలంగాణ బలగం గొంతు మూగబోయింది.. తోడుగా మీతోడుంటా.. అని పాడిన పస్తం మొగిలయ్య అస్తమయం
Balagam Mogilaiah : జానపద కళాకారుడు, బలగం చిత్రంలో క్లైమాక్స్ పాటతో అందరి మనసులు దోచుకున్న మొగిలయ్య కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగులయ్య వరంగల్‌లోని ఓ ఆస్పత్రిలో కన్ను మూశారు.
Balagam mogiliah: తెలంగాణ బలగం గొంతు మూగబోయింది. తోడుగా మీతోడుంటా.. అని పాడిన పస్తం మొగిలయ్య.. ఎవరి తోడు లేకుండా వెళ్లిపోయారు. బలగం సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన బుడగజంగాల కళాకారుడు మొగిలయ్య.. తుదిశ్వాస విడిచారు.
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన మొగిలయ్య.. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్న సమయంలో.. గుండె వ్యాధి వచ్చింది. కొన్నాళ్లుగా దుగ్గొండిలోని తన ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్న ఆయన.. గురువారం తెల్లవారుజామున మృతిచెందారు.
జబర్దస్త్ ఫేమ్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ద్వారా పస్తం మొగిలయ్య వెలుగులోకి వచ్చారు. మొగిలయ్య, అతని భార్య ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన బలగం సినిమాలో.. పస్తం మొగిలయ్య దంపతులు పాడిన తోడుగా మీతోడుంటా పాట తెలంగాణలో మంచి గుర్తింపు పొందింది. ఎందరినో కంటతడి పెట్టించింది.
ఆ సినిమాకు ముందు పస్తం మొగిలయ్యది నిరుపేద కుటుంబం. బలగం తర్వాత ఆర్థికంగా కాస్త నిలదొక్కుకున్నా.. ఆ వెంటనే అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొగిలయ్య అండగా నిలిచింది. బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎ్మమెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మొగిలయ్యకు సాయం చేశారు. వైద్యం చేయిస్తానని భరోసా ఇచ్చారు. డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్న మొగిలయ్యను హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందేలా చేశారు.
దళితబంధు..
మొగిలయ్య ఆర్థిక కష్టాల గురించి పెద్ది సుదర్శన్ రెడ్డి.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. దీంతో కేసీఆర్ పస్తం మొగిలయ్యకు దళితబంధు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మొగిలయ్యను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు మరింత పెరిగాయి. ఆయన కుటుంబం పడుతున్న కష్టాలపై వచ్చిన వార్తలు అందరినీ కలిచివేశాయి. దీంతో పలువురు దాతలు ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సాయం అందించారు.
ఇటీవల పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మొగిలయ్య దంపతులకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని, వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కొద్ది రోజుల క్రితం లక్ష ఆర్థిక సాయం అందించారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరక్టర్ వేణు యెల్ధండి, నటీనటులు సంతాపం ప్రకటించారు.