Bad Teacher: ప్ర‌కాశం జిల్లాలో ఘోరం, మాయ‌ మాట‌లు చెప్పి బాలిక‌ను అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు... ఆపై వేధింపులు-teacher raped girl in prakasam district then harassed her ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bad Teacher: ప్ర‌కాశం జిల్లాలో ఘోరం, మాయ‌ మాట‌లు చెప్పి బాలిక‌ను అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు... ఆపై వేధింపులు

Bad Teacher: ప్ర‌కాశం జిల్లాలో ఘోరం, మాయ‌ మాట‌లు చెప్పి బాలిక‌ను అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు... ఆపై వేధింపులు

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 09:58 AM IST

Bad Teacher ప్ర‌కాశం జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మాయ‌మాట‌లు చెప్పి బాలిక‌పై ఒక కీచ‌క‌ ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఆపై వేధింపులకు పాల్ప‌డ్డాడు. నాలుగేళ్ల నుంచి జ‌రుగుతున్న వేధింపుల ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ప్రకాశం జిల్లాలో కీచక టీచర్, నాలుగేళ్లుగా విద్యార్ధినిపై అత్యాచారం
ప్రకాశం జిల్లాలో కీచక టీచర్, నాలుగేళ్లుగా విద్యార్ధినిపై అత్యాచారం

Bad Teacher: ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుడు దారి తప్పాడు. పాఠశాల విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో బాలిక త‌ల్లిదండ్రుల‌కు విషయం తెలిసింది. గుట్టు బయట పడటంతో ఆ ఉపాధ్యాయుడు ఏకంగా మెడిక‌ల్ లీవ్ పెట్టి స్కూల్‌కు రావ‌డమే మానేశాడు. త‌ల్లిండ్రులు స్కూల్‌కు వెళ్లి హెడ్ మాస్ట‌ర్‌కు విష‌యం చెప్పారు. హెడ్ మాస్ట‌ర్ త‌ల్లిదండ్రుల ఫిర్యాదును మండ‌ల విద్యా శాఖ అధికారి (ఎంఈవో)కి లిఖిత‌పూర్వ‌కంగా రిపోర్టు చేశారు. స‌మాచారం లేక‌పోవ‌డంతో ఇంకా పోలీసులు ఎటువంటి కేసు న‌మోదు చేయలేదు.

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా కురిచేడు మండ‌లంలోని ఒక జిల్లా పరిష‌త్ స్కూల్‌లోని చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే ఒక బాలిక జీవితాన్ని చిన్నాభిన్నం చేశాడు. బాలిక‌కు మాయ‌మాట‌లు లొంగ‌దీసుకుని ఆ ఉపాధ్యాయుడు కీచ‌కుడిలా మారాడు.

నాలుగేళ్లుగా ఆమెను వేధిస్తునే ఉన్నాడు. కుటుంబ స‌భ్యులు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం కురిచేడు మండ‌లంలోని ఒక జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల‌లో ఒక ఉపాధ్యాయుడు నాలుగేళ్ల క్రితం ఈ అఘాయిత్యానికి ఒడిగ‌ట్టాడు. ఆ సమయంలో స్కూల్‌కు ఇన్‌ఛార్జి హెడ్ మాస్టార్‌గా కూడా ఉన్నారు.

స్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి ఆమెను లొంగ‌దీసుకుని, అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. స్కూల్‌కు హెడ్ మాస్టార్ కావ‌డంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు రాకుండా క‌ప్పి పుచ్చాడు. ఆ బాలిక‌ను కూడా ఎవ‌రితో చెప్పొద్ద‌ని బెదిరించాడు. దీంతో భ‌య‌ప‌డిన ఆ బాలిక ఎవ‌రితోనూ చెప్ప‌కుండా త‌న‌లోనే బాధ‌ను దిగ‌మింగుకుంది. అప్ప‌టి నుంచి ఆ ఉపాధ్యాయుడు ఆ బాలిక‌ను వేధిస్తున్నాడు. ఆ కీచ‌క ఉపాధ్యాయుడు ఒక‌ ఉపాధ్యాయ సంఘంలో కూడా నాయ‌కుడిగా ఉన్నాడు.

బాలిక ప్ర‌స్తుతం గుంటూరులోని ఒక కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. అయినప్ప‌టికీ ఆ ఉపాధ్యాయుడు తీరు మార‌లేదు. ఆమెపై వేధింపులు కొనసాగిస్తున్నాడు. బాలిక ఎన్నిసార్లు వారించినా ఈ వేధింపులు ఆప‌లేదు. గ‌త నెలలో బాలిక త‌ల్లి దండ్రుల‌కు విష‌యం తెలిసింది. నాలుగేళ్ల‌గా త‌మ బిడ్డ ఎంతో మ‌నో వేద‌న‌కు గురైందో తెలుసుకున్నారు. త‌ల్లిదండ్రుల‌కు ఈ విష‌యం తెలిసిన‌ట్లు ఉపాధ్యాయుడికి తెలియడంతో త‌న‌కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని భావించి, గ‌త నెల 25 నుంచి మెడిక‌ల్ లీవ్ పెట్టి పాఠ‌శాల‌కు రావ‌టం లేదు.

దీంతో ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడొస్తాడోన‌ని బాలిక త‌ల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. అ ఈనెల 7 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగిన మెగా పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్స్‌లో భాగంగా ఆ స్కూల్‌లో కూడా మీటింగ్ జ‌రిగింది. ఆ రోజున బాలిక త‌ల్లిదండ్రులు స్కూల్‌కు వెళ్లి స్కూల్ హెడ్ మాస్టార్ జ‌య‌రాజ్‌ను నిల‌దీశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న నాయ‌కుడిగా ఉన్న‌ ఉపాధ్యాయ సంఘం హెడ్‌మాస్టార్ తెలిపారు. దీంతో సదరు ఉపాధ్యాయ సంఘం ఆ ప‌ద‌వి నుంచి, సంఘం నుంచి తొల‌గించింది.

మెగా పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్ రోజు డిసెంబర్ 7న త‌ల్లిదండ్రులు వ‌చ్చి త‌మ అమ్మాయి ప‌ట్ల కీచ‌కంగా ప్ర‌వ‌ర్తించిన ఉపాధ్యాయుడు ఎక్క‌డున్నాడ‌ని నిలదీశార‌ని, ఆయ‌న వ‌స్తే తాట తీస్తామ‌ని హెచ్చరించి వెళ్లిపోయార‌ని స్కూల్ హెడ్‌మాస్టార్‌ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి త‌న‌కు తెలిసిన వివరాల‌తోనూ, త‌ల్లిదండ్రుల ఫిర్యాదును మండ‌ల విద్యా శాఖ అధికారి (ఎంఈవో)కి లిఖిత‌పూర్వ‌కంగా రిపోర్టు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఆ స్కూల్ హెడ్ మాస్టార్ ఇచ్చిన రిపోర్టు మేర‌కు ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్తాన‌ని ఎంఈవో పేర్కొన్నారు. త‌మ‌కు ఎటువంటి ఫిర్యాదు, స‌మాచారం రాలేద‌ని, అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి కేసు న‌మోదు చేయ‌లేద‌ని ఎస్ఐ శివ తెలిపారు.

(జ‌గ‌దీశ్వ‌రరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner