Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..-snake bite scare in peddapur gurukul two students died of snake bites four months ago ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..

Peddapur Gurukulam: పెద్దాపూర్ గురు కులంలో పాము కాటు కలకలం.. నాలుగు నెలల క్రితం పాముకాటుతో ఇద్దరు విద్యార్థులు మృతి..

HT Telugu Desk HT Telugu
Dec 19, 2024 06:16 AM IST

Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో పాము కాటు కలకలం సృష్టిస్తుంది. 8 వ తరగతి విద్యార్థి పాము కాటుకు గురై కోరుట్ల ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.నాలుగు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులు పాముకాటుతో మృతి చెందగా, మరో విద్యార్థి పాము కాటు గురి కావడం సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాముకాటు
పెద్దాపూర్‌ గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాముకాటు

Peddapur Gurukulam: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల అంటే పాముల భయం నెలకొంది.‌ నాలుగు మాసాల క్రితం ఆగష్టు లో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. 8వ తరగతి చదివే విద్యార్థి ఓంకార్ అఖిల్ ఉదయం పాముకాటుకు గురికాక ఆలస్యంగా రాత్రి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్థి కోరుట్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

నొప్పి ఉందంటే తేలిగ్గా తీసుకున్న టీచర్స్...

పాము కాటుకు గురైన విద్యార్థి అఖిల్ నోప్పి ఉందని టీచర్ లకు చెబితే టేకిటీజీగా తీసుకున్నారు.‌ కుడి చేతి రిస్ట్ వద్ద రెండు కాట్లు ఉండగా దేంతో పొడుచుకున్నావని ప్రశ్నించి నొప్పి టాబ్లెట్లతో సరిపెట్టారు. నొప్పి ఎక్కువగా ఉందని విద్యార్థి తెలుపడంతో మెట్ పల్లిలో ఉండే విద్యార్థి పేరెంట్స్ రుచిత రవి లకు సమాచారం ఇచ్చారు.

పేరెంట్స్ గురుకులానికి చేరుకుని బాబును కోరుట్ల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. టెస్టులు చేసిన వైద్యులు పాము కాటేనని నిర్ధారించారు. పెంజర పాము కాటు లక్షణాలు ఉన్నాయని విరుగుడు మందు ఇచ్చామని వైద్యులు తెలిపారు.‌ ప్రస్తుతం బాబు విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరో 24 నుంచి 36 గంటలు అయితే గానీ ఏం చేప్పలేమన్నారు.

పాము కాటుతో ఆందోళన....

విద్యార్థి పాము కాటుకు గురి కావడంతో పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం చేయించకుండా టాబ్లెట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నొప్పి ఉందంటే ఏమైందని ఆరా తీయకుండా దేంతో పొడుచుకున్నావని ప్రశ్నించి బెదిరించారని పేరెంట్స్ తెలిపారు. గురుకులం ప్రిన్సిపాల్ మాత్రం విద్యార్థి నొప్పి ఉందనగానే ఆర్ఎంపి వైద్యునికి చూపించామని అతను పాముకాటు కాదనడంతో నొప్పి టాబ్లెట్ ఇచ్చామని తెలిపారు.

మారని గురుకులం పరిస్థితి…

గత ఆగస్టు మాసంలో పాము కాటుతో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పెద్దాపూర్ గురుకులంను సందర్శించారు. గురుకులంలోని పాత భవనాలను పూర్తిస్థాయిలో తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

ప్రతి గురుకులంలో ఏఎన్ఎం ను ఏర్పాటు చేయాలని స్నేక్ బైట్ తో పాటు అన్ని మందులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పెద్దాపూర్ గురుకులంను సందర్శించి నాలుగు మాసాలు పూర్తయిన ఇప్పటివరకు ఏఎన్ఎంను ఏర్పాటు చేయలేదు. అవసరమైన మందులు అందుబాటులో లేకుండా పోయాయి.

తాజా ఘటనతో అధికారుల, గురుకులం నిర్వాహకుల నిర్లక్ష్యం బహిర్గతం అయింది. ఇలా అయితే ఎలా గురుకులాలు బాగుపడుతాయని పేరెంట్స్ తోపాటు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner