2025లో ధన యోగం ఎవరిది? కొత్త సంవత్సర ఆర్థిక రాశి ఫలాలు 12 రాశులకు ఇక్కడ చూడొచ్చు
2025 సంవత్సరం మీ జీవితం డబ్బు పరంగా ఎలా ఉండబోతోంది? ఆర్థిక అంశాలపై సవివరంగా 12 రాశుల వారికి పంచాంగకర్త, బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఎవరికి ధనయోగం ఉంది? ఎవరు ఆర్థికంగా ఇక్కట్ల పాలవనున్నారో ఇక్కడ తెలుసుకోండి.
2025వ సంవత్సరం చిలకమర్తి పంచాంగ రీత్యా, ధృక్ సిద్దాంత ఆధారంగా 12 రాశుల వారికి ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మ శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆర్థిక సంబంధ రాశి ఫలాలను వివరించారు.
2025లో బృహస్పతి మే వరకూ వృషభ రాశిలో, జూన్ నుంచి డిసెంబరు వరకూ మిధున రాశిలో సంచరించనున్నారు. శని మార్చి వరకు కుంభరాశిలో, ఏప్రిల్ నుంచి మీనరాశిలో సంచరించనున్నారు. రాహు కేతువులు కుంభ, సింహ రాశుల్లో మార్పు చెందడం వంటివి సంభవించడం చేత 2025వ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఆర్థిక పరంగా ఈ రకమైనటువంటి గ్రహ స్థితి ఉన్నదని చిలకమర్తి తెలియజేశారు.
మేష రాశి 2025 ఆర్థిక స్థితి:
2025వ మేష రాశి వారికి ఆర్థిక పరంగా మొదటి మూడు నెలలు అనుకూల ఫలితాలు ఉంటాయి. తర్వాత ఏలినాటి శని ప్రభావం, నీచ గురుడి ప్రభావం చేత ఆర్థికపరంగా, కుటుంబ వ్యవహారాల పరంగా ప్రతికూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. మేష రాశి వారు 2025వ సంవత్సరంలో అప్పు చేయొద్దని, అప్పు ఇవ్వొద్దని సూచన. మేష రాశి వారికి 2025లో ఆర్థిక బాధలు, రుణ బాధలు పెరగడం, ఖర్చులు అధికమయ్యేటువంటి సమస్యలు అధికంగా గోచరిస్తున్నాయి.
పరిహారం: ఆర్థికపరంగా 2025 మేష రాశి వారికి మధ్యస్తం నుంచి చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. ఆర్థికపరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృషభ రాశి 2025 ఆర్థిక స్థితి
వృషభ రాశి వారికి 2025వ సంవత్సరం ఆర్థికపరంగా ప్రథమార్థం మొదటి ఆరు నెలలు మధ్యస్తం నుండి చెడు ఫలితాలు గోచరిస్తున్నాయి. ద్వితీయార్థం జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలము మధ్యస్తం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. 2025 మొదటి ఆరు నెలల్లో వృషభ రాశి వారు ఆర్థిక విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వృషభ రాశి వ్యాపారస్థుల వారికి 2025 మధ్యస్త సమయం. శని అనుకూలంగా వ్యవహరించడం చేత కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడెదరు. ఆర్థికపరంగా వృషభరాశికి 2025 మధ్యస్త ఫలితాలను అందజేస్తుంది.
పరిహారం: 2025వ సంవత్సరంలో ఆర్థికముగా శుభఫలితాలు పొందడం కొరకు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. విష్ణువు సహస్రనామ పారాయణం చేత శుభఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మిధున రాశి 2025 ఆర్థిక స్థితి
మిధున రాశికి 2025 ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. మిధున రాశికి దశమంలో శని సంచారం, గురుడు వ్యయ స్థానము, జన్మరాశి యందు సంచరించడం చేత ఖర్చులు అధికమవుతాయి. ధన నష్టము వంటివి అధికముగా గోచరించుచున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిళ్లతో నిర్ణయాలు తీసుకోవద్దని సూచన. ఈ సంవత్సరం అనవసరమైన, అక్కర్లేని వస్తు లేదా విషయాల మీద ఘనంగా ఖర్చు చేసెదరు.
పరిహారం: మిధునరాశి వారికి 2025 ఆర్థికపరంగా కొంత సమస్యలతో కూడి ఉన్న సంవత్సరం. 2025 సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
కర్కాటక రాశి 2025 ఆర్థిక స్థితి
2025 కర్కాటక రాశికి ఆర్థికపరంగా కొంతమార్పులిచ్చేటువంటి సంవత్సరం. అష్టమ శని ప్రభావం పూర్తవడం చేత కర్కాటక రాశి వారు 2025 సంవత్సరంలో ఆర్థికపరమైన విషయాల్లో తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత పురోగతిని ఇస్తాయి. కర్కాటక రాశి వారు. స్వగృహము నందైనా, కుటుంబంలోని శుభకార్యముల కోసం ధనాన్ని ఖర్చు చేయ సూచన. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల కోసం ధనమును ఖర్చు చేసెదరు. కర్కాటక రాశి వారికి ఆర్థికపరంగా 2025 మధ్యస్త ఫలితాలు ఉంటాయి.
పరిహారం: ఆర్థికపరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
సింహ రాశి 2025 ఆర్థిక స్థితి
ఈ రాశి వారికి 2025వ సంవత్సరంలో ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. సింహరాశికి ఏప్రిల్ నుండి అష్టమ శని ప్రభావముండటం, బృహస్పతి దశమ లాభస్థానాల్లో సంచరించడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సమస్యలతో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల యందు, కుటుంబ విషయాల యందు ఖర్చులు అధికమగు సూచన. పనుల యందు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు రాజకీయములు వంటివి కొంత ఇబ్బంది కలిగించును. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా నిర్ణయములు తీసుకోవడం మంచిది.
పరిహారం: 2025 సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
కన్యా రాశి 2025 ఆర్థిక స్థితి
2025 కన్యారాశి కి శని కళత్ర స్థానం నందు గురుడు భాగ్య మరియు దశమ స్థానం నందు సంచరించడం ఈ ఏడాది ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారు 2025లో ఖర్చులు, అప్పుల బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేసే ప్రయత్నం చేసెదరు. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఆర్థికపరంగా పురోగతి కలుగును. ప్రథమార్థం అనుకూల ఫలితాలు, ద్వితీయార్థం మధ్యస్త ఫలితాలు కలుగుతుంది. శుభకార్యములకు ధనమును ఖర్చు చేసెదరు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయని
చిలకమర్తి తెలిపారు. 2025 సంవత్సరం ఆర్థికంగా శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి.
తుల రాశి 2025 ఆర్థిక స్థితి
తులా రాశి వారికి శని 5 లేదా 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం, బృహస్పతి మే వరకూ అష్టమ స్థానం నందు, తదుపరి భాగ్య స్థానం నందు సంచరించడం చేత తులరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక పరంగా మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. తులరాశి వారు జనవరి నుంచి ఏప్రిల్ వరకూ అనుకోని, అనవసర ఖర్చుల వల్ల చికాకులు కలుగును. ఈ సమయంలో ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. మే నుంచి డిసెంబరు వరకూ ధనపరంగా, ఆర్థికపరంగా శుభఫలితాలను పొందెదరు. మొత్తం మీద 2025 తులరాశి వారికి ఆర్థికపరంగా ద్వితీయార్థంలో శుభఫలితాలు అధికముగా కలుగును.
పరిహారం: 2025వ సంవత్సరంలో ఆర్థికముగా శుభఫలితాలు పొందడం కొరకు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. విష్ణువు సహస్రనామ పారాయణం చేత శుభఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చికరాశి 2025 ఆర్థిక స్థితి
వృశ్చిక రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకూ అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకూ శని పంచమంలో అనుకూలంగా ఉన్నది. వృశ్చిక రాశి జనవరి నుంచి మే వరకూ కళస్ర స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం, జూన్ నుంచి డిసెంబరు వరకూ అష్టమ గురు ప్రభావం వలన ఆర్థికపరంగా 2025 మధ్యస్థ ఫలితాలను కలిగించును. జనవరి నుంచి మే వరకూ నూతన గృహ, వస్తు, ధన లాభములు కలుగును. జూన్ నుంచి డిసెంబరు వరకూ అష్టమ గురు ప్రభావం వలన ఆర్థిక విషయాల యందు, ఆరోగ్య విషయాల యందు కొంత సమస్యలు ఏర్పడును. 2025 ద్వితీయార్ధంలో ఖర్చులపరంగా, ఆరోగ్యపరంగా వృశ్చికరాశి వారు జాగ్రత్తలు వహించాలని సూచన.
పరిహారం: ఆర్థికపరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి. మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
ధనుస్సు రాశి 2025 ఆర్థిక స్థితి
ఈ రాశి వారికి 2025వ సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకూ తృతీయ స్థానంలో శని సంచరించును. ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకూ అర్ధాష్టమ శని ప్రభావం ఏర్పడటం చేత, జనవరి నుంచి మే బృహస్పతి శత్రుస్థానం నందు, జూన్ నుంచి డిసెంబరు వరకూ బృహస్పతి కళత్ర స్థానం నందు సంచరించడం 2025 ధనురాశికి అంత అనుకూలంగా లేదు. ధనురాశికి శత్రుపీడ అధికముగా ఉండును. ఆర్థికపరంగా అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు ఉండును. ధనురాశికి 2025 ప్రథమార్థం ఖర్చులతో, రాజకీయ ఒత్తిళ్లతో, శత్రు భయాలతో ఉండును. జూన్ నుంచి డిసెంబరు సమయం ధనురాశికి ఆర్థికపరంగా అనుకూల ఫలితాలు ఉండును.
పరిహారం: 2025వ సంవత్సరంలో ఆర్థికముగా శుభఫలితాలు పొందడం కొరకు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. విష్ణువు సహస్రనామ పారాయణం చేత శుభఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మకర రాశి 2025 ఆర్థిక స్థితి
మకర రాశి వారికి 2025వ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉన్నాయి. జనవరి నుంచి మార్చి వరకూ ఏలినాటి శని అంత్య సమయం. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు శని తృతీయ స్థానంలో అనుకూలంగా సంచరించడం, అలాగే బృహస్పతి జనవరి నుంచి మే వరకూ పంచమంలో అనుకూలం, జూన్ నుంచి డిసెంబరు వరకూ ఆరో స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత మకరరాశి వారికి ఆర్థికపరంగా 2025 మార్పు తెచ్చి శుభఫలితాలిచ్చే సంవత్సరం. మకరరాశి వారు 2025లో ఆర్థిక సమస్యల నుంచి కొంత బయటపడెదరు. అప్పులన్నింటి నుంచి తీర్చే ప్రయత్నాలు సఫలీకృతమగును. ధన సహాయము కలుగును. గత కొంత కాలంగా ఉన్న ఆర్థికపరమైన సమస్యలు, ఖర్చుల నుంచి బయటపడెదరు.
పరిహారం: ఆర్థికపరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభ రాశి 2025 ఆర్థిక స్థితి
కుంభ రాశి వారికి 2025 ఏలినాటి శని ప్రభావం వలన ఆర్థికపరంగా మధ్యస్థంగానే ఉండును. కుంభరాశి వారు అప్పులు చేసెదరు. ఖర్చుల బాధలు కొంత వేధించును. అనుకోని, అక్కరలేని ఖర్చులు కలుగును. అయినప్పటికీ బృహస్పతి నాలుగో ఇంట, ఐదవ ఇంట అనుకూలంగా సంచరించడం చేత ధన సహాయం లభించడం వలన ఆర్థిక సమస్యలను అధిగమించెదరు. రుణ బాధలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేసెదరు. నూతన గృహములకు, వస్తువుల కొనుగోలుకు ధనాన్ని అధికముగా ఖర్చు చేసెదరు. ప్రయాణములలో అనుకోని ఖర్చులు జరుగును.
పరిహారం: 2025వ సంవత్సరంలో ఆర్థికముగా శుభఫలితాలు పొందడం కొరకు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. విష్ణువు సహస్రనామ పారాయణం చేత శుభఫలితాలు కలుగుతాయి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.
మీన రాశి 2025 ఆర్థిక స్థితి
మీన రాశి వారికి 2025వ సంవత్సరం ఆర్థికపరంగా అంత అనుకూలంగా లేదు. మీనరాశికి ఏలినాటి శని ప్రభావం, జన్మ శని రాహువుల ప్రభావం ఉంటుంది. బృహస్పతి జనవరి నుంచి మే వరకూ తృతీయ స్థానం నందు ప్రతికూలంగా, జూన్ నుండి డిసెంబరు వరకూ చతుర్థ స్థానం నందు అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఆయా గ్రహ సంచారాల కారణంగా ఆర్థిక ఖర్చులు, సమస్యలు వేధించును. మీనరాశి వారికి 2025 ఆర్థికపరంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వొద్దని సూచన. అనుకోని ఖర్చులు అధికము అగును. జన్మ స్థానం నందు శని, రాహువుల ప్రభావం చేత చికాకులు, అనుకోని ఖర్చులు అధికమగును. 2025 ద్వితీయార్థంలో బృహస్పతి అనుకూలంగా సంచరించడం చేత ఆర్థిక విషయాలలో పురోగతి లభించును. వ్యాపారార్థులకు చెడు సమయం.
పరిహారం: ఆర్థికపరంగా శుభఫలితాలు పొందడానికి శనికి తైలాభిషేకం చేయండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు