Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన రష్యా.. ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయం!-coming soon russia develops cancer vaccine to distribute for free check details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన రష్యా.. ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయం!

Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన రష్యా.. ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయం!

Anand Sai HT Telugu
Dec 19, 2024 10:15 AM IST

Russia Cancer Vaccine : వైద్య రంగంలో అద్భుతం.. ప్రాణాంతక క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసింది. ఈ మేరకు ఆ దేశం ప్రకటించింది. మరో విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్‌లను ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది.

క్యాన్సర్ వ్యాక్సిన్(ప్రతీకాత్మక చిత్రం)
క్యాన్సర్ వ్యాక్సిన్(ప్రతీకాత్మక చిత్రం)

క్యాన్సర్ కేసులు ఇప్పుడు ప్రతిచోటా నమోదవుతున్నాయి. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన చికిత్స అందిస్తేనే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఇప్పుడు రష్యా క్యాన్సర్ కోసం ప్రత్యేక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. mRNA ఆధారితంగా రూపొందించిన వ్యాక్సిన్ క్యాన్సర్‌తో పోరాడుతుందని రష్యా చెబుతోంది. విశేషమేమిటంటే ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తామని రష్యా ప్రకటించింది.

రష్యా అభివృద్ధి చేసిన mRNA ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్ 2025 ప్రారంభంలో విడుదల కానుంది. క్యాన్సర్ వ్యాక్సిన్ విడుదలైన వెంటనే రష్యన్ మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. రష్యాలోని రేడియల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో క్యాన్సర్ కణితుల పెరుగుదలను నియంత్రించిందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులలో కణితులను నియంత్రించడంలో, వాటిని క్యాన్సర్ రహితంగా మార్చడంలో సహాయపడిందని గామాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్‌లోని ఎపిడెమియాలజీ, మైక్రోబయాలజీ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్జ్‌బర్గ్ తెలిపారు.

అనేక పరిశోధన సంస్థలు సమష్టి కృషితో క్యాన్సర్ వ్యాక్సిన్‌ను రూపొందించినట్టుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. క్లీనికల్ ట్రయల్స్‌లో కణతి పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు మెటాస్టాసిస్ అంటే వ్యాధికారక ఏజెంట్‌ను నిరోధించిందని తెలిపారు.

ఈ వ్యాక్సిన్ రోగికి క్యాన్సర్‌తో పోరాడే యాంటీబాడీని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది క్యాన్సర్ కణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడం ద్వారా, ఇది కణితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. గర్భాశయ క్యాన్సర్‌తో సహా అనేక ప్రాణాంతక, ప్రమాదకరమైన కణితి కణాలకు వ్యతిరేకంగా కూడా ఈ టీకా ప్రభావవంతంగా ఉంటుందని రష్యా అంటోంది.

వైద్యరంగంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ఒక ప్రధాన మైలురాయి కానుంది. అనేక దేశాలు క్యాన్సర్‌తో పోరాడటానికి టీకాలు, మందులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. రష్యా ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఈ ఏడాది ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశారు. క్యాన్సర్‌తో పోరాడే వ్యాక్సిన్‌ను రష్యా అభివృద్ధి చేసిందని చెప్పారు. ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో మంచి ఫలితాలను చూపిందన్నారు. ఈ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేయడంలో దాదాపు విజయం సాధించామని తెలిపారు. ఇప్పుడు తాజాగా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి రష్యా ప్రకటన చేసింది.

Whats_app_banner