Vrishchika Rashi 2025 Telugu: వృశ్చిక రాశి సంవత్సర ఫలితాలు.. ఆరోగ్య, కుటుంబ సమస్యలు
Vrishchika Rashi 2025 Telugu: వృశ్చిక రాశి 2025 సంవత్సర రాశి ఫలాలను బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ హిందుస్తాన్ టైమ్స్ పాఠకులకు ప్రత్యేకంగా అందించారు. నెలవారీగా వృశ్చిక రాశి వారికి కుటుంబ, ఆరోగ్య, ఉపాధి పరంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు.
వృశ్చిక రాశి 2025 సంవత్సర రాశి ఫలాలను చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఇక్కడ చూడొచ్చు. ఈ రాశి చక్రంలో బృహస్పతి మే నుండి ఎనిమిదో స్థానమునందు సంచరించనున్నాడు. శని ఐదవ స్థానమునందు సంచరించనున్నాడు. రాహువు మే నుండి నాలుగవ స్థానము నందు, కేతువు మే నుండి పదో స్థానమునందు సంచరించనున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం మధ్యస్థ ఫలితాలను సూచించుచున్నవి.
వృశ్చిక రాశి జాతకులకు 2025లో ఖర్చులు అధికమగును. ఖర్చులు నియంత్రించుకోవలసిన సమయం. వృశ్చిక రాశికి పంచమ స్థానములో శని అనుకూలంగా వ్యవహరించినప్పటికి, అష్టమ గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయాల యందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచన. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కొంతమేర ఇబ్బంది పెట్టును. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే సూచనలు కలుగుచున్నవి.
ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు?
నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలిగినప్పటికి పని ఒత్తిళ్ళు వంటివి కొంత వేధించును. వృశ్చికరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా కలసివచ్చును. ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు జాగ్రత్త వహించాలి.
వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము, ఆనందము కలుగును. పని ఒత్తిళ్ళు ఏర్పడు సూచన. ఆరోగ్య విషయాలయందు శ్రద్ధ వహించండి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండండి. ప్రతీ విషయాన్ని మనసు లోతుల్లోకి తీసుకోకండి.
రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయం. రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. వ్యాపారాభివృద్ధి జరుగును. సినీరంగం, మీడియా రంగాల వారికి అనుకూలమైనటువంటి సంవత్సరం. వ్యాపార సంబంధిత నిర్ణయాలు శుభఫలితాలను ఇచ్చును.
చేయవలసిన పరిహారాలు
2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామూర్తిని పూజించండి. తాంబూలం, శనలగను ముత్తయిదువలకు సమర్పించండి. శనగల ప్రసాదమును ఆలయాలలో పంచిపెట్టండి.
నెల వారీ జాతక ఫలాలు
జనవరి 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. ధనం, ఆదాయం పెరుగును. రాజకీయ నేపథ్యం ఉన్న శుభకార్యాలకు హాజరవుతారు. ఒక సమాచారం ఆనందాన్నిస్తుంది. ప్రయాణాల యందు జాగ్రత్త అవసరం. స్నేహ బాంధవ్యాలు పెరుగును. భార్యాపిల్లల గూర్చి ఆలోచిస్తారు.
ఫిబ్రవరి 2025:
ఈ మాసం వృశ్చిక రాశి జాతకులకు అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారములు కలసివచ్చును. శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికార ఒత్తిడి. సంతానపరంగా ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. రుణములు తీర్చుతారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
మార్చి 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వృత్తి ఉద్యోగపరంగా అనుకూల సమయం. స్థిరాస్తి వృద్ధి చేయుదురు. ఆకస్మిక ధనలాభముంది. వాహన, వస్త్ర లాభము లున్నాయి. లావాదేవీలు ఫలించును. దూరపు వ్యక్తులతో సంప్రదింపులు. నిరుత్సాహం
ఏప్రిల్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. విపరీతమైన ఖర్చులుంటాయి. ఏ కార్యము తలపెట్టినా కలసిరాదు. శారీరక అలసట. అపజయములు. వృథా శ్రమ. అనుకోని కష్టములు. అవమానములు ఎక్కువ. పుత్రుల కోసం ఆలోచన. శుభ వర్తమానముంటుంది.
మే 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. స్థిరాస్తులు కలసివచ్చును. కార్యలాభం. ప్రయాణము నందు సౌఖ్యం. కొత్త వ్యవసాయం ప్రారంభం. వ్యవహారాలలో విజయం. కోర్టు పనులు అనుకూలించును. సంఘంలో గౌరవముంటుంది. మానసికాందోళన, భయము చోటు చేసుకుంటుంది.
జూన్ 2025:
వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసం అంత అనుకూలంగా లేదు. బంధుమిత్రులతో విరోధములు. తీర్థయాత్రలు చేస్తారు. స్నేహితుల సహకారముంటుంది. శత్రువులు అధికమవుతారు. కార్యాటంకములు. పట్టుదల పెరుగును. స్థిరచరాస్తుల విక్రయం. కాళ్ళకు గాయములగును.
జూలై 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. వస్త్రప్రాప్తి. స్నేహ కలహములుంటాయి. దేవాలయ దర్శనములు. కుటుంబము నందు సౌఖ్యము. పెద్దవారితో సంప్రదింపులు చేస్తారు. మీరు చేసే పనికి ఆటంకాలేర్పడతాయి. ధనలాభముంటుంది. కార్యజయములుండును.
ఆగస్టు 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారపరంగా ఆటంకాలు. ధన నష్టములు, అపనిందలుంటాయి. స్థానచలనములు. ఆరోగ్య సమస్యలుంటాయి. స్త్రీ సమాగమములు. శక్తికి మించిన పనులు చేయుదురు. స్నేహితుల సహకారముంటుంది.
సెప్టెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది. కార్యజయములు, అధికార లాభము లుంటాయి. శుభమూలక ధన వ్యయం. వ్యవసాయపరంగా అభివృద్ధి. అందరి సహకారం ఉంటుంది. వాహన ప్రమాదాలు జరుగును. ఆస్థి వివాదాల ద్వారా కొన్ని అశుభవార్తలుంటాయి.
అక్టోబర్ 2025:
ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది. తక్కువ శ్రమతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంనందు ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుంటాయి. కోర్టు వ్యవహారములు కలసిరావు. విందు, వినోదాల్లో పాల్గొంటారు. కావలసినవారితో ఇబ్బందులు.
నవంబర్ 2025:
వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసం అనుకూలంగా లేదు. మాటపట్టింపులుంటాయి. శతృత్వము. వాహన ప్రమాదాలున్నాయి. పోలీసువారితో చిక్కులు. అనారోగ్య సమస్యలు. మీరు పనిచేయు సంస్థలో కీలకపాత్ర వహిస్తారు. జాయిట్ వ్యాపారం కలసిరాదు.
డిసెంబర్ 2025:
ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. మనోవేదన. వృథా ప్రయాస. కోర్టుపరంగా ఇబ్బందులు. వృథా ప్రయాణాలుంటాయి. భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు. ఇంటి పనులపరంగా ఖర్చు. వివాహ ప్రయత్నాలు.
- చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, పంచాంగకర్త
సంబంధిత కథనం