Ap Govt Compensation: రైలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
Ap Govt Compensation: విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఏపీ ప్రభుత్వం రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. రైల్వే శాఖ రూ.2లక్షల పరిహారం ప్రకటించింది.
Ap Govt Compensation: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైలు ప్రమాద బాధితులను ఆదుకునేందుకు తీసుకుంటున్న చర్యలను సిఎం కేంద్ర మంత్రికి వివరించారు.
రైలు ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందిస్తున్నట్లు సిఎం అశ్విని వైష్ణవ్‌కు వివరించారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
విజయనగరం సమీపంలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రి జగన్‌కు ఫోన్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తెలియజేశారు. సహాయ బృందాలను వెంటనే ఘటనాస్థలానికి పంపించామని, క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు సత్వర చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఘటనాస్థలానికి మంత్రి బొత్స సత్యన్నారాయణను పంపించామని, స్థానిక కలెక్టర్, ఎస్పీకూడా అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టిపెట్టారని, వీరిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు.
ఏపీవారికి రూ.10 లక్షలు, ఇతర రాష్ట్రాల వారికి రూ.2లక్షలు..
రైలు ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించాలన్నారు. అలాగే మరణించన వారిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారికి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ప్రధాని రూ.2లక్షల చొప్పున సాయం
ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రమాద స్థలం నుంచి ప్రయాణికులందరినీ తరలించినట్లు అశ్వినీ వైష్ణవ్ 'ఎక్స్'లో వెల్లడించారు.