Ragi Burelu: రాగి బూరెలు ఇలా చేశారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, తీయగా పిల్లలకు నచ్చుతాయి-ragi burelu recipe in telugu know how to make this sweet recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ragi Burelu: రాగి బూరెలు ఇలా చేశారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, తీయగా పిల్లలకు నచ్చుతాయి

Ragi Burelu: రాగి బూరెలు ఇలా చేశారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది, తీయగా పిల్లలకు నచ్చుతాయి

Haritha Chappa HT Telugu
Dec 19, 2024 03:30 PM IST

Ragi Burelu: టేస్టీగా రాగి బూరెలు ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. సాధారణ బూరెలతో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రెసిపీ కూడా చాలా సులువు.

రాగి బూరెలు
రాగి బూరెలు (Youtube)

చలికాలంలో వేడివేడిగా రాగి బూరెలు చేసుకొని తినండి. ఇవి తీయగా, టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఎవరైనా తినవచ్చు. దీనిలో మనం బెల్లాన్ని, రాగి పిండిని ఎక్కువగా వినియోగిస్తాం. ఈ రెండూ కూడా మనం ఆరోగ్యానికి మేలు చేసేవే. రాగి బూరెలు చేసేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు. అరగంటలో వీటిని వండేయొచ్చు. ఇక వీటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

రాగి బూరెలు రెసిపీకి కావలసిన పదార్థాలు

ఎండు కొబ్బరి ముక్కలు - పావు కిలో

యాలకులు - నాలుగు

రాగిపిండి - ఒక కప్పు

గోధుమపిండి - ఒక కప్పు

ఉప్పు - చిటికెడు

బెల్లం తురుము - ఒక కప్పు

నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

నెయ్యి - ఒక స్పూను

బేకింగ్ సోడా - పావు స్పూను

నువ్వులు - ఒక స్పూను

రాగి బూరెలు రెసిపీ

1. రాగి బూరెలను చేసేందుకు ముందుగా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

2. ఆ ఎండు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసి యాలకులను కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

3. ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండిని జల్లించి వేయాలి.

4. అలాగే గోధుమ పిండిని కూడా జల్లించి వేసుకోవాలి.

5. ఇలా జల్లించడం వల్ల పిండి సాఫ్ట్ గా మారుతుంది. అందులో చిటికెడు ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.

6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం, నీళ్లు వేసి పాకంలా చేయాలి.

7. ఆ బెల్లం పాకంలో రెండు స్పూన్ల నువ్వులను వేసి కలుపుకోవాలి.

8. ఇప్పుడు ముందుగా పొడి చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.

9. అందులో ఒక స్పూను నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.

10. ఈ బెల్లం పాకాన్ని రాగి పిండి మిశ్రమంలో వేసి స్పూన్ తోనే కలుపుకోవాలి.

11. మొత్తం బెల్లం పాకాన్ని వేసి స్పూన్ తోనే కలుపుకోవాలి.

12. అందులోనే పావు స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలపాలి.

13. చేత్తోనే ఈ మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. తర్వాత చపాతీ పిండిలా కలిపేందుకు కాచి చల్లార్చిన పాలను వేసి కలుపుకోవాలి.

14. ఇది చపాతీ పిండిలాగా తయారయ్యాక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలి.

15. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.

16. నూనె వేడెక్కాక ఈ రాగి పిండి నుంచి చిన్న ముద్దలను తీసి చేతితోనే చిన్న పూరీల్లా ఒత్తుకొని నూనెలో వేయాలి.

17. అవి పొంగి బూరెల్లాగా అవుతాయి. అంతే టేస్టీ రాగి బూరెలు రెడీ అయినట్టే. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే మీరు వదలలేరు. ఇది మీకు కచ్చితంగా నచ్చుతాయి.

రాగి పిండితో చేసే రాగి బూరెలు హెల్దీ స్నాక్స్ గా చెప్పుకోవాలి. ముఖ్యంగా వీటిని ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రాగి బూరెలు చేయడానికి 40 నిమిషాలు సరిపోతుంది. ఒకసారి వీటిని ప్రయత్నించి చూడండి, మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Whats_app_banner