Kurnool Crime : కర్నూలు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులతో దాడి.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!
Kurnool Crime : కర్నూలు జిల్లాలో ప్రేమ జంటపై కత్తులతో దాడి ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియురాలే ఈ దాడి చేయించింది. ఆమెకు ఇద్దరు లవర్స్ ఉన్నారు. దీంతో మొదటి ప్రేమికుడిని అడ్డుతొలగించుకునేందుకే.. పథకం ప్రకారం ప్రియురాలే దాడి చేయించింది.
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు సమీపంలో.. మంగళవారం ప్రేమ జంటపై కత్తులతో దుండగులు దాడి చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వడ్డే అరవింద్ స్థానికంగా ఓ కళాశాలలో దూర విద్యా డిగ్రీ చదువుతున్నాడు. అరవింద్ ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మధ్య ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు మందలించడంతో విరమించుకున్నారు. వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం కొనసాగుతోంది.
మరో అబ్బాయితో..
ప్రస్తుతం ఆ అమ్మాయి ఓ కాలేజీలో బీటెక్ చదువుతోంది. అదే కాలేజీలో మరో అబ్బాయితో ప్రేమలో పడింది. ఒకరికి తెలియకుండా మరొకరితో మాట్లాడుతూ ఇద్దరితోనూ ప్రేమాయణం నడుపుతోంది. ఇటీవల మొదటి ప్రియుడి విషయం తెలసుకున్న రెండో ప్రియుడు, యువతిని నిలదీశాడు. దీంతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు తాను ప్రేమించడం లేదని, అతడే వేధిస్తున్నాడని చెప్పింది. ఈ క్రమంలో రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడు అరవింద్‌పై దాడికి కుట్ర పన్నారు. రెండు రోజులు మందుగానే గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు వచ్చి రెక్కీ నిర్వహించుకుని వెళ్లింది.
మంగళవారం అరవింద్‌ను గాజులదిన్నె ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లింది. ఇదే విషయాన్ని ఫోన్‌లో మెసేజ్ ద్వారా రెండో ప్రియుడికి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చింది. అతడు తన స్నేహితులతో కలిసి అప్పటికే అక్కడ ముళ్లపొదల మాటున కాపు కాచుకుని ఉన్నాడు. వారు అటుగా వస్తున్న సమయాన్ని గుర్తించి వెంటనే అరవింద్‌పై వేట కొడవళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తమతో తెచ్చుకున్న వేటకొడవళ్లతో దాడి చేశారు.
వెంటనే యువతి పారిపోయింది. అయితే అరవింద్‌ను మాత్రం వారు వదలలేదు. అరవింద్ గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు పరుగున వచ్చి రాళ్లు విసిరారు. దీంతో అరవింద్‌ను అక్కడే వదిలేదిలేసి ముగ్గురు మోటారు సైకిళ్లపై పరారయ్యారు. బాధితుడు అరవింద్ రక్తపుమడుగుల్లో తీవ్ర గాయాలతో ఉన్నాడు. వెంటనే రైతులు పోలీసులకు సమాచారం అందించారు.
గోనెగండ్ల సీఐ గంగాధర్ పోలీసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అరవింద్‌ను అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు. బుధవారం పోలీసులు విచారణ జరిపారు. ఈ విచారణలో ఈ దాడిలో యువతిదే పక్కా ప్లాన్ అని తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. ఈ విషయంపై సీఐ గంగాధర్ మాట్లాడుతూ.. ప్రేమ జంటపై దాడి కేసు విచారణ జరుపుతున్నామని, ఇంకా చాలా విషయాలు బయటకు రావాల్సి ఉందన్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)