Telangana Police : క్రిస్మస్, సంక్రాంతి సీజన్.. ఇంటికి తాళం వేసి ఊరెళ్తున్నారా.. అయితే ఈ 7 జాగ్రత్తలు మర్చిపోవద్దు!
Telangana Police : పండగల సీజన్ వచ్చింది. డిసెంబర్ 25న క్రిస్మస్ ఉంది. ఆ తర్వాత కొన్ని రోజులకే సంక్రాంతి వస్తోంది. దీంతో చాలామంది ఊర్లకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటారు. ఇళ్లకు తాళం వేసి వెళతారు. వారికి తెలంగాణ పోలీసులు కీలక సూచనలు చేశారు. 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండగల సందర్భంగా.. చాలామంది దూర ప్రాంతాలకు వెళ్తారు. ఇంటికి తాళం వేశాం కదా అని ధైర్యంగా ఉంటారు. కానీ.. ఇటీవల తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. పగలు పక్కాగ రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయంలో దోచేస్తున్నారు. తీరా ఇంటికి వచ్చేదాకా అసలు దొంగతనం జరిగిన విషయం తెలియదు.
చోరీ జరిగాక.. పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు దర్యాప్తు చేయడం, దొంగల కోసం గాలించడం చాలా పెద్ద ప్రాసెస్. చోరీకి గురైన సొమ్ము దోరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. అందుకే తెలంగాణ పోలీసులు ప్రజలకు, ముఖ్యంగా ఊరెళ్లే వారికి కీలక సూచనలు చేశారు. 7 జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
7 జాగ్రత్తలు..
1.ఇంటికి, ఇంటిగేటుకు తాళం వేసి దూర ప్రాంతాలకు వెళ్లవద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్లినా సమీప బంధువులను, తెలిసిన మిత్రులను ఇంటి దగ్గర పడుకొనే విధంగా చూసుకోవాలి.
2.ఒకవేళ తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకి కనపడే విధంగా గేట్‌కి, మెయిన్ డోర్‌కి వేయకూడదు. గేట్ బయట నుండి కాకుండా లోపల నుండి, మెయిన్ డోర్ కాకుండా పక్క డోర్లకు తాళం వేసుకోవాలి. తాళం కనపడకుండా డోర్ కర్టెన్‌తో కవర్ చేసే విధంగా చూసుకోవాలి.
3.ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులను.. బంగారు, వెండి ఆభరణాలను, నగదును బీరువాలో పెట్టకూడదు. తప్పనిసరిగా బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలి.
4.రాత్రి సమయంలో ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదైనా రూంలో లైట్ వేసి ఉంచాలి.
5.తప్పనిసరి ఊరికి వెళ్తే.. ఇంటి పక్కన వారికి, సంబంధిత పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించాలి. పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే.. రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచుతారు.
6. ఫోన్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి సీసీటీవీ కెమెరాలను ఇంటికి అమర్చుకోవాలి. ఇంటి బయటకు నాలుగు దిక్కులా రోడ్డు కవర్ అయ్యే విధంగా కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.
7.ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు మీ ఇంటి చుట్టుపక్కల, కాలనీలో తిరుగితే.. వెంటనే డయల్ 100 కి గాని, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గాని సమాచారం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఈ సూచనలు పాటిస్తూ.. సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.