Car Key Insurance : కారు తాళం చెవికి కూడా ఇన్సూరెన్స్ చేయడం ముఖ్యం.. లేదంటే వేలల్లో నష్టం భరించాలి
Car Key Insurance : సాధారణంగా కార్లకు ఇన్సూరెన్స్ చేయిస్తాం. అయితే కారు తాళం చెవికి కూడా బీమా చేయించాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కీలకు వేలల్లో ధర ఉంటుంది. పొగొట్టుకున్నా మళ్లీ తిరిగి కొనేంత అమౌంట్ రిఫండ్ వస్తుంది.
మీ కారు తాళం చెవికి బీమా చేయించారా? ఒక వేళ చేయించకుంటే ఈ వార్త మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కారుకు మాత్రమే కాదు.. కారు కీకి కూడా బీమా తప్పనిసరిగా చేయిస్తే మీకు మంచిది. ఇందుకోసం అమౌంట్ కూడా పెద్దగా ఖర్చు అవ్వదు. కారు బీమాతో పాటు, కీలకు బీమా చేయడం చాలా ముఖ్యం. మీకు కార్ కీ ఇన్సూరెన్స్ లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
పాత కార్లు సాధారణ మాన్యువల్ కీలతో వచ్చేవి. ఈ మాన్యువల్ కీ చౌకగా ఉండేవి. ఇవి పోతే డూప్లికేట్ చేయించుకునేవారు. దానిపై బీమా తీసుకోవలసిన అవసరం లేదు. కానీ నేటి ఆధునిక కార్లు కొత్త FOB ఎలక్ట్రిక్ కీలతో వస్తున్నాయి. వీటికి వేలల్లో ఖర్చవుతుంది.
కారు కీలను ఎవరైనా దొంగిలించినా లేదా పోగొట్టుకున్నా బీమా కంపెనీలు కొత్త కీ ధరను భరిస్తాయి. మీరు అనుకోకుండా మీ కారు కీని పోగొట్టుకుంటే దాని లాక్, లాక్‌ప్యాడ్‌ను మార్చాలి. లాక్ సెట్ ఖరీదైనది. దాని రీప్లేస్‌మెంట్‌కు కారు మోడల్‌ను బట్టి రూ. 5,000 నుండి రూ. 20,000 వరకు ఖర్చవుతుంది. మీరు కారు కీలను బీమా చేయిస్తే సంబంధిత బీమా కంపెనీ దాని ఖర్చులను భరిస్తుంది.
మీరు కారుకు బీమా చేసినప్పుడు కంపెనీ మీకు కీ రీప్లేస్‌మెంట్ యాడ్-ఆన్ కవర్‌ను కూడా అందిస్తుంది. ఇందుకోసం అదనంగా రూ.300-400 ప్రీమియం చెల్లించాలి. అయితే వివిధ బీమా కంపెనీలు వేర్వేరు ప్రీమియం ఛార్జీలను వసూలు చేస్తాయి.
కారు కీ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగిలించినా.. ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. సంబంధిత బీమా కంపెనీకి కాల్ చేయడం లేదా ఇమెయిల్ రాయడం ద్వారా తెలపాలి. దీని తర్వాత అవసరమైన పత్రాలతో పాటు క్లెయిమ్ పేపర్‌ను సమర్పించాలి. ఈ ప్రక్రియ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. పత్రాలను సమర్పించిన తర్వాత, బీమా కంపెనీ మీ క్లెయిమ్‌ను ధృవీకరిస్తుంది. ధృవీకరణ పూర్తయిన తర్వాత కీ రీప్లేస్‌మెంట్ క్లెయిమ్ ఖర్చులను కంపెనీ భరిస్తుంది.
అయితే ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు. అందువల్ల మీరు కారు కీలను జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా పిల్లలతో కలిసి కారులో ప్రయాణిస్తున్నప్పుడు, కారు కీలను మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి. వారి చేతికి ఇస్తే పొగొట్టే అవకాశం ఉంది.